Air India: ఇదేం బాదుడు బాబోయ్... భార్యా భర్తలు పక్కపక్కనే కూర్చోవాలంటే మరింత కట్టాలంటున్న ఎయిరిండియా!

  • ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా పిండుతున్న ఎయిరిండియా
  • కోరుకునే సీటును బట్టి రూ. 200 నుంచి రూ. 1500 బాదుడు
  • తీవ్రంగా మండిపడుతున్న ప్రయాణికులు

ఏ విధంగానైనా ఆదాయాన్ని, లాభాలను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, తాజాగా మరో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. కుటుంబ సభ్యులంతా కలసి ఒకే విమానంలో ప్రయాణిస్తుంటే, వారికి ఒకేచోట సీట్లను కేటాయించాలంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిందేనని చెప్పింది. ప్రస్తుతం దూర ప్రాంతాలకు వెళ్లే విమానాల్లో ముందు వరుసలో ఉన్న సీట్లను కోరుకునే కుటుంబాల నుంచి మాత్రమే అధిక ఫీజులను వసూలు చేస్తున్న సంస్థ, సీట్ సెలక్షన్ పేరిట కొత్త సేవలను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించింది. 'ఫ్యామిలీ ఫీజు' పేరిట అదనపు బాదుడును ప్రారంభించింది. ఓ చిన్న కుటుంబానికి అంటే... భార్యా భర్తలు తమ బిడ్డతో కలసి వెళుతున్నా, వారి ముగ్గురికీ ఒకే చోట సీటు ఇవ్వాలంటే దూరాన్ని బట్టి రూ. 1500 వరకూ చెల్లించుకోవాల్సిందే.

ఈ మేరకు ట్రావెల్ ఏజంట్లకు అదనపు ఫీజులను తెలుపుతూ ఎయిరిండియా సర్క్యులర్ లను జారీ చేసింది. దేశవాళీ విమానంలో మిడిల్ సీటు కోరుకుంటే రూ. 100, విండో సీటును లేదా వరుసలో ఆఖరి సీటును తన కుటుంబ సభ్యుడి కోసం కోరుకుంటే రూ. 200 వసూలు చేయాలని, అదే ఇంటర్నేషనల్ విమానంలో అయితే రూ. 200 నుంచి రూ. 1500 వరకూ అదనంగా తీసుకోవాలని సూచించింది. ఇక, ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కనే సీటు కావాలంటే ప్రయాణ మార్గాన్ని బట్టి రూ. 800 నుంచి రూ. 1500 వరకూ చెల్లించాలని తెలిపింది.

ఉదాహరణకు ఇండియా నుంచి యూఎస్ వెళ్లే విమానాల్లో మిడిల్ సీటు చాలనుకుంటే 3 డాలర్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సీటు కావాలంటే 50 డాలర్లు, విండో లేదా వరుస చివరిలో ఉండే సీటుకు 15 డాలర్లు కట్టాల్సిందే. ఇక, ఓ జంట తమ బిడ్డతో కలసి వెళుతూ ముగ్గురూ ఒకే వరుసలో ఉండాలంటే 33 డాలర్లు అదనంగా చెల్లించుకోక తప్పదు. పిల్లాడి పక్కన ఒక్కరు కూర్చోవాలన్నా కనీసం 18 డాలర్లు వదిలించుకోవాల్సిందే. ఈ తాజా నిబంధనలు, వడ్డింపులపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News