BJP: రెస్టారెంట్ అనుకున్నా... క్లబ్ అని తెలీనే తెలీదు: మాట మార్చిన ఎంపీ సాక్షీ మహరాజ్
- లక్నోలో నైట్ క్లబ్ ను ప్రారంభించిన సాక్షీ మహరాజ్
- అది రెస్టారెంట్ అని చెప్పారని వ్యాఖ్య
- యాజమాన్యంపై చర్యలకు డిమాండ్
దేశవ్యాప్తంగా ఉన్నావోలో జరిగిన అత్యాచార ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ, అదే నియోజకవర్గ పార్లమెంట్ ఎంపీ, బీజేపీ నేత సాక్షీ మహరాజ్, లక్నోలో ఓ నైట్ క్లబ్ ను ప్రారంభించడంపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో, ఆయన మాట మార్చారు. తాను పొరపాటు పడి దాన్ని ప్రారంభించానని తెలిపారు. అది ఓ రెస్టారెంట్ అని తాను భావించానని, నైట్ క్లబ్ అని తనకు తెలీనే తెలీదని, నైట్ క్లబ్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను డిమాండ్ చేశారు. ఈ మేరకు లక్నో సీనియర్ సూపరింటెండెంట్ కు ఓ లేఖను రాశారు.
కాగా, ఆదివారం నాడు తన నియోజకవర్గానికి చెందిన రజ్జన్ సింగ్ చౌహాన్ అనే న్యాయవాది తనను అలీగంజ్ ప్రాంతంలోకి తీసుకెళ్లారని, అక్కడ తనకు సుమిత్ సింగ్, అమిత్ గుప్తాలను రెస్టారెంట్ యజమానులుగా పరిచయం చేశారని చెప్పారు. ఆపై తనను రెస్టారెంట్ ప్రారంభించాలని కోరితే అంగీకరించానని అన్నారు. మీడియాలో రిపోర్టులను చూసిన తరువాతనే అది రెస్టారెంట్ కాదు, నైట్ క్లబ్ అని తెలిసిందని అన్నారు.