aasifa: అసిఫా కుటుంబానికి, న్యాయవాది దీపిక కు రక్షణ కల్పించండి!: సుప్రీంకోర్టు నోటీసులు
- చిన్నారి అసిఫా తండ్రి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ
- రక్షణ కల్పించాలని జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి నోటీసులు
- చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కథువా కేసు నిందితులు
- ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 28కి వాయిదా
కథువా అత్యాచార ఘటనకు సంబంధించి జమ్మూకశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆసిఫా కుటుంబానికి, ఈ కేసును వాదిస్తున్న న్యాయవాది దీపిక ఎస్.రాజావత్ కు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తమకు రక్షణ కల్పించాలని చిన్నారి అసిఫా తండ్రి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది.
మరోపక్క, కథువా కేసులో నిందితులను చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితులకు చార్జిషీటు కాపీలను అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా, కథువా రేప్ కేసులో బాధితుల పక్షాన వాదిస్తున్న న్యాయవాది దీపిక ఎస్.రాజావత్ తన ప్రాణాలకు హాని ఉందని, తనను కూడా రేప్ చేసి చంపేందుకు కుట్ర జరుగుతున్న విషయాన్ని సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే.