Asaduddin Owaisi: మక్కా మసీదు పేలుళ్ల కేసు తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ మండిపాటు
- ఎన్ఐఏ, ప్రధాని మోదీ సర్కారుపై ఫైర్
- న్యాయం దక్కలేదని వ్యాఖ్య
- ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధమని ఆగ్రహం
మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఈ రోజు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై స్పందించిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం తెలుపుతూ ఎన్ఐఏ, ప్రధాని మోదీ సర్కారుపై మండిపడ్డారు. ఈ తీర్పు వంద శాతం అన్యాయమైనదని అన్నారు. పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన 9 మంది కుటుంబాలకు న్యాయం దక్కలేదని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం, ఎన్ఐఏలు వ్యవహరించాయని ఆయన ఆరోపించారు.
అప్పట్లో అరెస్టయిన ప్రధాన నిందితులకు 90 రోజుల లోపే బెయిల్ వచ్చినప్పటికీ ఎన్ఐఏ సవాలు చేయలేదని, ఈ కేసులో కీలక సాక్షులు చాలా మంది 2014 తర్వాత మాటమార్చారని చెప్పారు. కళ్లముందు ఇంత జరుగుతున్నా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఏమీ చేయలేదని, ఇందులో రాజకీయ జోక్యం ఉందని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో న్యాయమన్నదే లేకుండాపోయే ప్రమాదం ఉందని ఆయన ట్వీట్ చేశారు.