Indus civilization: సింధు నాగరికత అంతరించిపోవడానికి కారణమిదే!
- ప్రపంచంలోనే గొప్పదైన సింధు నాగరికత
- 4,350 ఏళ్ల క్రితం ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు
- 900 సంవత్సరాలు కొనసాగిన కరవు
ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా భాసిల్లిన సింధునాగరికత అంతరించిపోవడానికి గల కారణాన్ని ఐఐటీ ఖరగ్ పూర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. సుదీర్ఘంగా వేధించిన కరవు కారణంగా సింధు నాగరికత అంతరించిపోయిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. 4,350 సంవత్సరాల క్రితం రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో కరవు ప్రారంభమైందని, కొన్నేళ్ల తరువాత అది తీవ్రరూపం దాల్చి సుమారు 900 సంవత్సరాలు కొనసాగిందని ఐఐటీ ఖరగ్ పూర్ భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్ కుమార్ గుప్తా తెలిపారు.
దీంతో అక్కడి ప్రజలు గంగా, యమునా లోయ గుండా ప్రయాణిస్తూ, ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు బెంగాల్, దక్షిణ వింధ్యాచల్, దక్షిణ గుజరాత్ లలోని మైదాన ప్రాంతాలకు చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల 5 వేల ఏళ్ల క్రితం వాయవ్య హియాలయాల్లో వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీని వల్ల నదులు ఎండిపోయే పరిస్థితి వచ్చి అది తీవ్రమైన కరవుకు దారితీసిందని అన్నారు. దీంతో సిరిసంపదలతో విలసిల్లిన సింధునాగరికత ప్రాభవం కోల్పోయిందని తెలిపారు. దీనికి ఆధారంగా లడఖ్ లోని మోరిరి సరస్సుకు సంబంధించిన 5 వేల సంవత్సరాల రుతుపవన, శీతోష్ణస్థితి మార్పుల పట్టికను జతచేశారు.