rainfall: మే రాక ముందే 140 జిల్లాల్లో నీటి కోసం పాట్లు... కానరాని గంగమ్మ!
- శీతాకాలం నుంచి మొహం చాటేసిన వర్షాలు
- భూమిలో అడుగంటిపోయిన జలాలు
- వాతావరణ శాఖ తాజా గణాంకాలు
నడి వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మంచి నీటి కోసం అలమటించే పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం... 404 జిల్లాల్లో గతేడాది అక్టోబర్ తర్వాత వర్షాల్లేకపోవడంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో 140 జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మరో 109 జిల్లాల్లో ఓ మోస్తరు కరువు ఉంది.
156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు ఉంది. నిజానికి ఏటా చాలా జిల్లాల్లో ఈ పరిస్థితులు వేసవిలో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ ఏడాది శీతా కాలంలో అసలు వర్షాలే లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశవ్యాప్తంగా 63 శాతం వర్షాభావం ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రిజర్వాయర్లలో తక్కువ నీటి లభ్యత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్ ఉన్నాయి.