Rajamahendravaram: ఆస్తి రాసివ్వలేదని.. మంచం పట్టిన అక్కపై ప్రతాపం చూపిన చెల్లెలు... వీడియో ఇదిగో!
- పక్షవాతంతో బాధపడుతున్న పుష్పవతి
- లేవలేని స్థితిలో ఉన్న ఆమెపై చెల్లెలి దాష్టీకం
- వీడియో తీసి బయటపెట్టిన స్థానికులు
పక్షవాతం వచ్చిన ఓ వృద్ధురాలు, తనకు ఆస్తిని రాసివ్వడం లేదన్న కోపంతో చెల్లెలే రాచి రంపాన పెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా పెనికేరుకు చెందిన పంతం పుష్పవతి, భర్త చనిపోవడంతో నరేంద్రపురంలోని తన చెల్లెలు వరసైన ప్రగడ మంగాదేవి ఇంట్లో ఉంటోంది.
పుష్పవతికి పెనికేరులో కొంత స్థలం ఉండగా, అది తన పేరున రాస్తుందన్న ఆశతో ఆమెను చూసుకున్న మంగాదేవి, ఆ తరువాత తన ప్రతాపం చూపడాన్ని ప్రారంభించింది. ఏడాది క్రితం పక్షవాతం వచ్చి పుష్పవతి మంచానికే పరిమితం కావడంతో స్థలం వెంటనే రాసివ్వాలని అడుగుతూ తన దాష్టీకాన్ని చూపుతోంది. ఆ స్థలాన్ని తన సోదరులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో పుష్పవతి నిరాకరిస్తూ రాగా, మంచంపై లేవలేని స్థితిలో ఉన్న ఆమెను చిత్ర హింసలకు గురి చేసింది.
స్థానికులు ప్రశ్నించడంతో ఇళ్లు ఖాళీ చేసి లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో చేరింది. అక్కడ కూడా తన పైశాచికత్వాన్ని మానకపోవడంతో, స్థానిక యువకుడు వీడియో తీసి బయటపెట్టాడు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బాధితురాలిని ప్రభుత్వాసుపత్రిలో చేర్చి మంగాదేవిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.