YSRCP: టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు... నిర్ణయం జగన్ దే: విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
- వైకాపాతో చర్చలు సాగిస్తున్న టీడీపీ నేతలు
- 29 సార్లు ఢిల్లీ వెళ్లి హోదాను మరచిన చంద్రబాబు
- అధికారంలోకి వచ్చేది వైకాపాయే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారని, ఈ దిశగా వారు వైకాపాతో చర్చలు సాగిస్తున్నారని, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ వీరి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వుందని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. విశాఖలోని పాతగాజువాక ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
తదుపరి అధికారంలోకి వచ్చేది తామేనని, ఆపై చంద్రబాబు, లోకేశ్ జరిపిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పుకునే చంద్రబాబుకు, అన్నిసార్లూ ప్రత్యేక హోదా గురించి అడగాలని గుర్తుకు రాలేదని విమర్శలు గుప్పించారు. ఎర్రచందనాన్ని విక్రయించి డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు, రూ. 10 వేల కోట్ల రహస్య ఒప్పందాన్ని చైనాతో చేసుకున్నారని విజయసాయి ఆరోపించారు.