Karnataka: కర్ణాటక ఎన్నికలు: 90 శాతం కాంగ్రెస్ టికెట్లు సిట్టింగులకే!

  • వచ్చే నెల 12న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు
  • 107 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్లు
  • ఒకే ఒక్క స్థానం నుంచి బరిలోకి సీఎం సిద్ధ రామయ్య

కర్ణాటకలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్న తమ నేతల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. అనూహ్యంగా 90 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈసారి టికెట్ దక్కించుకోగలిగారు. మొత్తం 122 మంది శాసనసభ్యుల్లో 107 మందికి అధిష్ఠానం తిరిగి టికెట్లు ఇచ్చింది. ముగ్గురిని పెండింగ్‌లో పెట్టగా, ఎనిమిది మంది ఆశావహులు టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు.

రెండు స్థానాల నుంచి  ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పోటీ చేస్తారన్న వార్తలు ఊహాగానమే అని తేలిపోయింది. కేవలం చాముండేశ్వరి నియోజకవర్గం నుంచే ఆయన బరిలోకి దిగనున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు జి.పరమేశ్వర కొరటగెరె నుంచి పోటీ చేయనున్నారు.

నిజానికి సీఎం రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని భావించినా పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. చాముండేశ్వరి నుంచి ఆయన గెలుపు ఖాయమన్న ఉద్దేశంతో అక్కడి నుంచే బరిలోకి దిగాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

 కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో సిద్ధ రామయ్య మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. తనకు బాగా కావాల్సిన వాడైన బీదర్ సౌత్ ఎమ్మెల్యే అశోక్ ఖెనీకి తిరిగి టికెట్ ఇప్పించుకోగలిగారు. బెంగళూరులోని శాంతినగర్ సహా ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News