yogi aaditya: యూపీ సీఎంపై కర్ణాటక కాంగ్రెస్ నేత తీవ్ర వ్యాఖ్యలు!

  • యోగి తన పదవికి రాజీనామా చేయాలి
  • ఈ పదవికి ఆయన పనికిరాడు .. చెప్పులతో కొట్టాలి 
  • చివరికి క్షమాపణలు చెప్పిన కాంగ్రెస్ నేత 

యూపీలోని ఉన్నావో ఘటన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ పై కర్ణాటక కాంగ్రెస్ నేత దినేశ్ రావు గుండు తీవ్ర వ్యాఖ్యలు. చేశారు. యూపీలోని ఉన్నావో, జమ్మూకాశ్మీర్ లోని కథువాలో జరిగిన అత్యాచార ఘటనలన నిరసిస్తూ బెంగళూరులో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేశ్ రావు గుండు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతటితో ఆగని దినేశ్ రావు గుండు, సీఎం పదవికి యోగి ఆదిత్యానాథ్ పనికి రారని, ఆయన్ని చెప్పులతో కొట్టాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉన్నావో ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని మండిపడ్డారు.

కాగా, దినేశ్ రావు గుండు చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ, దినేశ్ రావు ఉపయోగించిన పదజాలం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ ఓ ట్వీట్ చేశారు. ఓ ముఖ్యమంత్రి, నాథ కుటుంబం నుంచి వచ్చిన ఓ సాధువుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, కర్ణాటకలోని నాథాపంత్ అనుచరులు క్షమించరని అన్నారు.

కర్ణాటకలో సిద్ధరామయ్య పరిపాలనలో 3587 అత్యాచారాలు జరిగాయని, మరి, ఆయన్ని దేనితో కొట్టాలని ఘాటుగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో దినేశ్ రావు గుండు స్పందిస్తూ.. భావోద్వేగంలో తాను అలా మాట్లాడానని, ఈ వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే వెనక్కి తీసుకుంటున్నానని అన్నారు.

yogi aaditya
Karnataka
Congress
  • Loading...

More Telugu News