UCO Bank: మరో బ్యాంకు కుంభకోణం... యూకో బ్యాంకుకు రూ. 621 కోట్లకు టోకరా వేసిన మాజీ చైర్మన్
- రుణాలు నిరర్థక ఆస్తుల పేరిట నష్టం
- వడ్డీతో కలిపి బ్యాంకుకు రూ. 737 కోట్లు లాస్
- పలువురిపై కేసు నమోదు చేసిన సీబీఐ
మరో బ్యాంకు కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రుణాలు, నిరర్థక ఆస్తుల పేరిట యూకో బ్యాంకు వందల కోట్లు నష్టపోగా, మొత్తం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి బ్యాంకు మాజీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కౌలేనని సీబీఐ తేల్చింది. 2010 నుంచి 5 సంవత్సరాల పాటు బ్యాంకు చైర్మన్ గా పని చేసిన ఆయన, రూ. 621 కోట్ల మేరకు నష్టం కలిగించారని, ఆ మొత్తం ప్రస్తుతం వడ్డీతో కలిపి రూ. 737 కోట్లు అయిందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.
బ్యాంకు నిధులను కాజేయాలనే ఉద్దేశంతోనే కుట్ర జరిపి రుణాలను ఆయన మంజూరు చేయించారని సీబీఐ పేర్కొంది. నకిలీ పత్రాలను సృష్టించేందుకు చార్టెడ్ అకౌంటెంట్లు సహకరించారని, ఆపై ఇరా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా సంస్థకు 2010 మార్చిలో రూ. 200 కోట్లు, అక్టోబరులో రూ. 450 కోట్ల రుణాన్ని ఇప్పించారని తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐఎఫ్‌సీఐ దగ్గర ఇరా సంస్థ తీసుకున్న రుణాలను తీర్చేస్తామని, ఆపై తక్కువ వడ్డీతో తమకు చెల్లించవచ్చని చెబుతూ వీటిని మంజూరు చేసినట్టు అధికారులు తమ విచారణలో తేల్చారు.
ఢిల్లీ లోని ఎనిమిది ప్రాంతాలతో పాటు ముంబైలోని రెండు చోట్ల శనివారం నాడు విస్తృతంగా సోదాలు జరిపిన సీబీఐ, కౌల్ తో పాటు ఇరా సీఎండీ హేమ్ సింగ్ భరానా, మరో ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లపైనా కేసులు నమోదు చేసింది.