Finance Minister: రాజ్యసభ సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-8d0fdb4ae3f5d529f45e98e1cb4fdb3ec3fb8269.jpg)
- గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జైట్లీ
- ఇటీవల ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్థిక మంత్రి
- వెంకయ్యనాయుడు సమక్షంలో ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం
మూత్ర పిండాల సమస్యతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేడు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు చాంబర్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన 65 ఏళ్ల జైట్లీ అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేశారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు చాంబర్‌లో అరుణ్ జైట్లీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఏప్రిల్ 3న రాజ్యసభ నాయకునిగా మరోమారు నియమితుడైన జైట్లీకి ఏప్రిల్ 9న ఎయిమ్స్‌లో డయాలసిస్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నియంత్రణలో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అనారోగ్యం కారణంగా జైట్లీ విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నారు.