India: భారత్ ఒక్కసారి అభివృద్ధి బాట పడితే, మరో పదేళ్ల పాటు దానికి తిరుగుండదు!: రఘురాం రాజన్
- భారత్, చైనాలను పోల్చడం సరికాదు
- ఈ రెండూ విభిన్న దేశాలు
- భారత్ కు చాలా విషయాల్లో మంచి ఖ్యాతి ఉంది
భారత్, చైనాలను పోలుస్తూ ఇటీవల కొందరు చేస్తున్న వ్యాఖ్యలను ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తప్పుబట్టారు. అలా పోల్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. న్యూయార్క్ లో ఆయన మాట్లాడుతూ, భారత్, చైనాలు రెండూ విభిన్న దేశాలని అన్నారు. అందుకే ఈ రెండు దేశాలను పోల్చడం సరికాదని చెప్పారు. ప్రధానంగా ఆర్థిక వృద్ధి విషయంలో భారత్ ను చైనాతో పోల్చడం ఏ మాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
ఇక చైనా సంగతి పక్కనబెడితే... చాలా విషయాల్లో భారత్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఖ్యాతి ఉందని ఆయన గుర్తు చేశారు. భారత్ చేయలేనిది, చైనా చేస్తున్నది మౌలిక సదుపాయాల కల్పన ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. భారత్ లో మౌలిక సదుపాయలను మెరుగుపరిస్తే వృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
భారీ ప్రాజెక్టులను చేపట్టడం భారత్ లో కష్టతరమైన అంశమని ఆయన పేర్కొన్నారు. దేశం మొత్తంపై ఒకే వ్యక్తి పెత్తనం చెలాయించే వ్యవస్థ మనుగడలో ఉన్నంత వరకు మౌలిక సదుపాయాల కల్పన అంత సులభం కాదని ఆయన తెలిపారు. స్వేచ్చాయుత వాణిజ్య ప్రజాస్వామ్యం ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుందని, భారత్ ఒక్కసారి అభివృద్ధి బాట పడితే, ఇక మరో పదేళ్ల పాటు దానికి తిరుగుండదని ఆయన అభిప్రాయపడ్డారు.