France: సిరియాపై అమెరికా, ఫ్రాన్స్, యూకే మూకుమ్మడి దాడులు.. బాంబుల వర్షం కురిపిస్తున్న విమానాలు!
- రసాయన ఆయుధాలు వాడుతున్నట్టు సిరియాపై ఆరోపణలు
- గత వారం జరిగిన రసాయన దాడిలో 60 మంది పౌరుల మృతి
- అసద్ దాచిపెట్టిన కెమికల్ వెపన్స్‌పై దాడి చేయాలంటూ ట్రంప్ ఆదేశం
సిరియాపై అమెరికా, ఫ్రాన్స్, యూకేలు మూకుమ్మడి వైమానిక దాడులకు దిగాయి. గతవారం సిరియా ప్రభుత్వ దళాలు జరిపిన దాడుల్లో 60 మంది పౌరులు మృతి చెందారు. వారి మృతికి రసాయన దాడే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. రెబల్స్ ఏరివేతలో భాగంగా గతవారం సిరియా ప్రభుత్వం నిర్వహించిన దాడుల్లో 60 మంది పౌరులు మరణించారు. వీరిలో ఎక్కువమంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. రెబల్స్ ఏరివేతకు ప్రభుత్వం రసాయన దాడులకు దిగుతోందని, వాటి కారణంగా అమాయక ప్రజలు మరణిస్తున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తమ దళాలకు ఆదేశాలు జారీ చేశారు.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ రసాయన ఆయుధాలు దాచిపెట్టినట్టు చెబుతున్న డమాస్కస్‌పై దాడి చేసి వాటిని నిర్వీర్యం చేయాలని ఆదేశించారు. సిరియా రసాయన ఆయుధాలను ఉపయోగించడం నిలిపివేసేంత వరకు ఫ్రాన్స్, బ్రిటన్ దళాలతో కలిపి దాడి చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
వివిధ లక్ష్యాలపై అత్యంత శక్తిమంతమైన తొమహాక్ క్రూయిజ్ మిసైల్స్‌తో దాడి చేస్తున్నట్టు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. తాము మనుషులపై దాడి చేయడం లేదని, రాక్షుసులపై దాడి చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. అసద్ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్న రష్యా, ఇరాన్‌పై ట్రంప్ నిప్పులు చెరిగారు. ‘‘అమాయక పౌరులను, చిన్నారులను చంపేస్తున్న దేశానికా మీరు మద్దతు ఇస్తున్నది?’’ అని నిలదీశారు.