Karnataka: కర్ణాటకలో ఇండియా టుడే ఒపీనియన్ పోల్.. బీజేపీకి షాక్!

  • రాష్ట్రంలో హంగ్.. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్
  • 90-101 సీట్లకు పరిమితం కానున్న కాంగ్రెస్
  • ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్న బీఎస్పీ-జేడీఎస్ కూటమి

కర్ణాటకలో వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరినీ వరించకపోయినా, కాంగ్రెస్ మాత్రం అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఇండియా టుడే-కార్వీ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో వెల్లడైంది. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 113 సీట్లు అవసరం కాగా, కాంగ్రెస్‌ 90-101, బీజేపీ 78-96 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. బీఎస్పీ-జేడీఎస్ 34 నుంచి 43 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించనున్నట్టు సర్వే తెలిపింది. ముఖ్యమంత్రిగా ఎవరికి మద్దతు ఇస్తారని ప్రశ్నించగా 33 మంది సిద్ధరామయ్యకు ఓటేశారు. యడ్యూరప్పకు 26 శాతం మంది, కుమారస్వామికి 21 శాతం మంది మద్దతు పలికారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌పై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు వచ్చే అవకాశం లేదని ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. లింగాయత్‌ల మైనారిటీ హోదా బీజేపీ ఓటు బ్యాంకును చీల్చే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం 40 సీట్లున్న జేడీఎస్ మాత్రం తన సీట్లను కాపాడుకోనుందని తెలిపింది.

మార్చి 17 నుంచి ఏప్రిల్ 5 వరకు ఇండియా టుడే-కార్వీ ఒపీనియన్ పోల్ సర్వే నిర్వహించింది. 62 శాతం గ్రామీణ ప్రాంతాల్లో, 38 శాతం పట్టణాల్లో సర్వే చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు రెండోసారి అవకాశం ఇవ్వాలని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News