Agrigold: అయ్యా.. జగన్ గారూ.. రూ.5 వేల కోట్లు ఇప్పించండి.. అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ మీకే!: కుటుంబరావు
- జగన్ తన మీడియా ద్వారా అసత్య ప్రచారం చేయిస్తున్నారు
- అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.35 వేల కోట్లట
- సదావర్తి భూముల విషయంలోనూ ఇలాగే చేశారు
- జగన్ ఓకే అంటే కోర్టుతో మాట్లాడతాం
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ఏపీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులకు సంబంధించి తన మీడియాలో వార్తలు రాయిస్తున్న జగన్ వాటి విలువ రూ.35 వేల కోట్ల వరకు ఉంటుందని పదేపదే చెబుతున్నారని, కానీ ఆయన రూ.5 వేల కోట్లు ఇప్పిస్తే ఆ ఆస్తులు మొత్తం ఆయనకు ఇప్పించేలా కోర్టుకు విజ్ఞప్తి చేస్తామని అన్నారు. జగన్ దీనికి ముందుకు రావాలని, రూ.35 వేల కోట్ల విలువైన ఆస్తులను కేవలం రూ.5 వేల కోట్లకే సొంతం చేసుకునే అద్భుత అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు.
దుష్ప్రచారం జగన్‌కు మామూలేనని, గతంలో సదావర్తి సత్రం భూముల విషయంలోనూ జగన్ ఇలాగే తన మీడియాలో వాటి విలువను పెంచి రాయించారని గుర్తు చేశారు. వాటి విలువ రూ.1000 కోట్లు ఉంటుందని తన మీడియాలో రాయించారని, వేలానికి పెడితే వచ్చిన ధర ఎంతో అందరికీ తెలుసని అన్నారు.
ఏపీలోని అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.4 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశామని, హైకోర్టు వేసిన కమిటీ రూ.6900 కోట్ల వరకు ఉంటుందని లెక్కకట్టిందని పేర్కొన్న కుటుంబరావు ఇవన్నీ తెలిసి కూడా జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని దుమ్మెత్తి పోశారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం ప్రతినిధులను జగన్ కంపెనీల ప్రతినిధులు కలిసి మాట్లాడారని, కాబట్టి ఈ ఆస్తులను వారినే కొనుగోలు చేయాలని చెబుతున్నామని అన్నారు.
కంపెనీ ఆస్తులను తొలుత కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిన ఎస్సెల్ గ్రూపు తర్వాత వెనక్కి తగ్గిందన్నారు. కోర్టు అనుమతి ఇస్తే సీబీసీఐడీ ఆధ్వర్యంలో ఆస్తుల వేలం నిర్వహిస్తామని కుటుంబరావు తెలిపారు.