unnao: ఉన్నావో, కతువా అత్యాచార ఘటనలపై ఎట్టకేలకు స్పందించిన ప్రధాని మోదీ
- ఇటువంటి ఘటనలు నాగరిక సమాజంలో జరగకూడనివి
- మనం సిగ్గుపడాల్సి వస్తుంది
- దారుణాలకు పాల్పడుతోన్న వారు చట్టం నుంచి తప్పించుకోలేరు
- మన ఆడబిడ్డలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావో, జమ్ముకశ్మీర్‌లోని కతువా అత్యాచార ఘటనలు దేశాన్ని కుదిపేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై దేశంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు, సినీ ప్రముఖులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటి గురించి వింటుంటే ఆగ్రహం కలుగుతోందని, సిగ్గు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అతి దారుణ ఘటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరు విప్పడం లేదని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఈ ఘటనలపై మోదీ ఎట్టకేలకు మాట్లాడారు. ఈ రోజు ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ప్రసంగిస్తూ.. రెండు రోజులుగా దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఉన్నావో, కతువా లాంటి ఘటనలు నాగరిక సమాజంలో జరగకూడనివని అన్నారు. ఇటువంటి ఘటనలతో మనం సిగ్గుపడాల్సి వస్తుందని, మహిళలపై దారుణాలకు పాల్పడుతోన్న వారు చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. మన ఆడబిడ్డలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెబుతున్నానని వ్యాఖ్యానించారు.