gyle: గేల్ కు అచ్చొచ్చిన మైదానం.. కట్టడి చేయడం ఎలా?
- చిన్నస్వామి స్టేడియంలోనే గేల్ అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు
- బెంగళూరుకు ఐపీఎల్ లో 151.20 స్ట్రైక్ రేట్ తో 85 మ్యాచ్ లు ఆడిన గేల్
- గేల్ ను కట్టడి చేయడంపై ప్రణాళికలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు గేల్ గుబులు పట్టుకుంది. టీ20 ఫార్మాట్ లో విండీస్ ఆటగాడు క్రిస్ గేల్ విధ్వంసకర ఆటగాడిగా పేరు సంపాదించాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి గేల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. సీజన్ 11లో అతనిని ఆ ఫ్రాంఛైజీ పక్కన పెట్టింది. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా నిలవగా, గేల్ ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్ లో పంజాబ్ జట్టు గేల్ ను పక్కన బెట్టింది. ఆ మ్యాచ్ లో ఆ జట్టు విజయం సాధించిన నేపథ్యంలో ఈ మ్యాచ్ లో కూడా గేల్ ను పక్కన బెడుతుందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భావిస్తోంది.
ఒకవేళ గేల్ ను ఆ జట్టు ఆడించినా, అతడిని కట్టడి చేసే ప్రణాళిక తమవద్ద ఉందని ఆ జట్టు కోచ్ డేనియల్ వెట్టోరీ పేర్కొన్నాడు. ఆడుతాడో, లేదో తెలియని గేల్ గురించి వెట్టోరీ వ్యాఖ్యానించాడంటే... గేల్ ఆటపై ఆ జట్టు ఆందోళన చెందుతోందని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో గేల్ ను పంజాబ్ జట్టు ఆడిస్తే, చిన్న స్వామి స్టేడియం అతనికి బాగా అచ్చొచ్చిన మైదానం. ఈ మైదానంలోనే గేల్ 2013లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులను సాధించాడు. అంతే కాకుండా ఐపీఎల్ మొత్తంలో 85 మ్యాచ్ లాడిన గేల్, స్ట్రైక్ రేట్ 151.20. ఈ నేపథ్యంలో, బాగా అలవాటైన మైదానంలో గేల్ చెలరేగే అవకాశం ఉందని బెంగళూరు జట్టు ఆందోళన చెందుతోంది.