nawaz sharif: నవాజ్ షరీఫ్ కు పాక్ సుప్రీంకోర్టు షాక్.. ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం!
- ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం
- బహిరంగసభల్లో కూడా పాల్గొనకుండా ఆదేశం
- పనామా పేపర్స్ కేసులో కీలక తీర్పు
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఆ దేశ సుప్రీంకోర్టు. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. అంతేకాదు ఎలాంటి బహిరంగ సభల్లో కూడా పాల్గొనకూడదని ఆదేశించింది. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 62(1)(ఎఫ్) ప్రకారం ఆయనపై ఈ మేరకు నిషేధం విధించింది. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ నిషేధం సరైనదేనని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయపడింది.
పనామా పేపర్స్ కేసు నేపథ్యంలో షరీఫ్ పై ఈ వేటు పడింది. ఆస్తుల వివరాలను ప్రకటించడంలో షరీఫ్ విఫలం కావడంతో.... గత ఏడాది పాక్ సుప్రీంకోర్టు ఆయనను ప్రధాని పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. షరీఫ్ తో పాటు పాకిస్థానీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ప్రధాన కార్యదర్శి జహంగీర్ తరీన్ పై కూడా జీవితకాల నిషేధం విధించింది. ఆయన ఎలాంటి పదవులు చేపట్టకూడదని ఆదేశించింది.