Air India: ఎయిర్ ఇండియాను కొనండి...డబ్బులు మేమిస్తాం: అనిల్ అంబానీ వద్దకు దూతలను పంపిన ఎతిహాద్
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-84ce4e127843efb4aaeef972b4f27a3503f5f4f8.jpg)
- ఎయిరిండియాలో విక్రయానికి 76 శాతం వాటాలు
- ముందుకొచ్చి వెనక్కు వెళ్లిన ఇండిగో, టాటా గ్రూప్
- అడాగ్ తో ఎతిహాద్ చర్చలు
రుణ భారాన్ని మోయలేక, లాభాల్లోకి రాలేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ ఎయిరిండియాను కొనుగోలు చేయాలని గల్ఫ్ ఎయిర్ లైన్స్ సంస్థ ఎతిహాద్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇండిగో, టాటా గ్రూప్ వంటి సంస్థలు ఎయిర్ ఇండియాలో మేజర్ వాటాలను కొనుగోలు చేసే విషయంలో ఆలోచనలు జరిపి వెనకడుగు వేసిన వేళ, ఇండియాలో ఓ భాగస్వామిని ఎంచుకుని అతని ద్వారా ఎయిరిండియాలో విక్రయానికి ఉంచిన 76 శాతం వాటాలను పొందాలని భావిస్తున్న ఎతిహాద్, అందుకు అనిల్ దీరూభాయి అంబానీ గ్రూప్ సరైన సంస్థని భావిస్తోంది.
ఇప్పటికే ఎతిహాద్ తన దూతలను అనిల్ అంబానీ వద్దకు పంపించి చర్చలు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
![](https://img.ap7am.com/froala-uploads/froala-a13bcec0b05adeededfbf4c4bfad14c53b0f3810.jpg)
అయితే, ఈ విక్రయం తరువాత సంస్థ నిర్వహణ, కీలక పోస్టులు భారతీయుల చేతుల్లోనే ఉండాలన్న షరతును కూడా ప్రభుత్వం విధించడంతోనే ఎతిహాద్, అనిల్ అంబానీని సంప్రదించినట్టు ఈ రంగంలోని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/froala-9e321cf8a5eb36a14aeaf22899e603ae10953261.jpg)
కాగా, బ్రిటీష్ ఎయిర్ వేస్, సింగపూర్ ఎయిర్ లైన్స్ తదితర సంస్థలు కూడా ఎయిరిండియాపై ఆసక్తిని చూపుతున్నట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఒకవేళ అనిల్ అంబానీ, ఎతిహాద్ ల మధ్య డీల్ కుదిరితే, రెండో భారత ఏవియేషన్ కంపెనీలో ఎతిహాద్ పెట్టుబడులు పెట్టినట్లవుతుంది. 2007లో జెట్ ఎయిర్ వేస్ లో 26 శాతం వాటాలను ఎతిహాద్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.