Chandrababu: నీ సమస్యలకన్నా నా ముందున్న సమస్యలే పెద్దవి: అఖిలప్రియకు క్లాస్ పీకిన చంద్రబాబు!
- అఖిలప్రియ, సుబ్బారెడ్డిలతో మాట్లాడిన చంద్రబాబు
- పరస్పర విమర్శలతో పార్టీకి నష్టం
- ఇకపై గొడవ పడుతున్నట్టు ఫిర్యాదులు రాకూడదు
- కలుపుకుని వెళ్లాలని అఖిలప్రియకు సలహా
కర్నూలు జిల్లాలో ఉప్పూ నిప్పులా నిత్యమూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిలను తన వద్దకు పిలిపించుకున్న చంద్రబాబు, ఇద్దరిపైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పరస్పర విమర్శల కారణంగా పార్టీకి నష్టం కలుగుతోందని, ఇటువంటి ఘటనలు ఇకపై తన దృష్టికి రారాదని హెచ్చరించారు. అందరినీ కలుపుకుని వెళితేనే పైకి ఎదుగుతారని అఖిలప్రియకు చురకలు అంటించారు. ఆ సమయంలో తనకు ఎదురవుతున్న సమస్యలను అఖిల ప్రియ ప్రస్తావించబోగా, అవన్నీ తన ముందు చెప్పవద్దని, నీ ముందున్న సమస్యలకన్నా తన ముందు ఎంతో పెద్ద సమస్యలు ఉన్నాయని చెప్పారు.
గతంలో ఒకటిగా ఉన్న రెండు కుటుంబాలూ ఇప్పుడు విడిపోతే ప్రజలు తప్పుగా భావిస్తారని అటు ఏవీకి, ఇటు అఖిలకూ నచ్చజెప్పారు. ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డి విమర్శలు గుప్పిస్తే తండ్రి లేని పిల్లలకు అండగా లేరని ప్రజలు భావిస్తారని, అఖిల విమర్శిస్తే, తండ్రి సమానులను, ఆయన స్నేహితులను దూరం చేసుకుంటోందని అనుకుంటారని వ్యాఖ్యానించారు. సమస్యలు ఉంటే పార్టీలో చెప్పుకోవాలే తప్ప, బహిరంగ వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. చిన్న వయసులో వచ్చిన మంత్రి పదవిని కాపాడుకోవాలని అఖిలప్రియకు సూచించారు.