america: పాకిస్థాన్ దౌత్యవేత్తలపై కఠిన ఆంక్షలు విధించబోతున్న అమెరికా
- నియామక స్థానాల నుంచి 25 మైళ్ల దూరం మాత్రమే ప్రయాణించాలి
- అంతకు మించితే ముందుగానే అనుమతి తీసుకోవాలి
- వచ్చే నెల 1 నుంచి అమల్లోకి ఆంక్షలు
వచ్చే నెల 1వ తేదీ నుంచి పాకిస్థాన్ దౌత్యవేత్తలపై అమెరికా కఠిన ఆంక్షలను విధించబోతోందని పాక్ మీడియా తెలిపింది. ఈ ఆంక్షల ప్రకారం పాక్ దౌత్యవేత్తలు తమ నియామక స్థానాల నుంచి కేవలం 25 మైళ్ల దూరం మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అంతకు మించిన దూరం ప్రయాణించాల్సి వస్తే... అమెరికా అధికారుల నుంచి ఐదు రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పాక్ మీడియా తెలిపింది.
ఈ మేరకు వాషింగ్టన్ లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి నోటీసులు కూడా పంపినట్టు తెలుస్తోందని పేర్కొంది. డాన్ పత్రిక కథనం ప్రకారం... గత నెలలో ఈ నోటిఫికేషన్ పాక్ దౌత్య కార్యాలయానికి చేరింది. దీనిపై అమెరికా, పాక్ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే, దీనిపై అటు అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ కానీ, ఇటు పాకిస్థానీ దౌత్య కార్యాలయం కానీ అధికారికంగా స్పందించలేదు.