Talasani: సామాన్యులు కుటుంబ సభ్యులతో కలిసి సినిమాకు వెళ్లే పరిస్థితి లేదు: తెలంగాణ మంత్రి తలసాని
- ఉన్నతాధికారులతో తలసాని సమీక్ష
- థియేటర్లలో ఇష్టానుసారం టిక్కెట్లు విక్రయిస్తున్నారని వ్యాఖ్య
- ప్రైవేటు వెబ్‌సైట్లు విధిస్తోన్న సేవారుసుముపై చర్చ
- టిక్కెట్‌పై రూ.20 నుంచి రూ.40 వసూలు చేస్తున్నాయని ఆగ్రహం
ఆన్ లైన్ టిక్కెటింగ్ అమలుకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. సినిమా థియేటర్లలో సినిమా టిక్కెట్ల విక్రయాల్లో పారదర్శకత పాటించడం కోసం ఆన్ లైన్ టిక్కెట్ విధానం అమలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ రోజు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో తన ఛాంబర్ లో ఆన్ లైన్ సినిమా టిక్కెటింగ్ విధానంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎఫ్‌డీసీ చైర్మన్ రామ్మోహన్ రావు, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, సమాచార శాఖ కమిషనర్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, రెవిన్యూ (వాణిజ్య పన్నులు) ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, న్యాయశాఖ సెక్రటరీ నిరంజన్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. వారం రోజుల్లో సమావేశం నిర్వహించి ఆన్ లైన్ టిక్కెటింగ్ అమలుకు చేపట్టవలసిన చర్యలను గుర్తించాలని మంత్రి సూచించారు.
ప్రస్తుతం సినిమా టిక్కెట్ల ధరలను ఇష్టానుసారంగా వసూలు చేయడం, థియేటర్లలో విక్రయిస్తోన్న తినుబండారాలకు అధిక ధరలు వసూలు చేస్తోన్న కారణంగా సామాన్యుడు కుటుంబ సభ్యులతో కలసి సినిమాకు వెళ్లలేని పరిస్థితి ఉందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రైవేటు ఆన్ లైన్ వెబ్ సైట్ లు 20 నుండి 40 రూపాయల వరకు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్న కారణంగా ప్రేక్షకులపై భారం పడుతుందని ఆయన అన్నారు. ఒక్కో సినిమా ప్రదర్శనకు 50 శాతం టిక్కెట్లు మాత్రమే ఆన్ లైన్ లో విక్రయించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా అదనపు టిక్కెట్లు విక్రయిస్తున్నారని మంత్రి చెప్పారు. జీఎస్‌టీ విధానంలో 100 రూపాయల కంటే తక్కువ టిక్కెట్లపై 18 శాతం, 100 రూపాయల కంటే ఎక్కువ ఉంటే 28 శాతం పన్ను వసూలు చేయబడుతోందని, ఆన్ లైన్ విధానంలో 1.98 శాతంతో ఎలాంటి అదనపు వసూలు ఉండదని ఆయన అన్నారు. అంతేకాకుండా, సినిమా థియేటర్లలోని క్యాంటీన్లలో తినుబండారాల ధరలు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా అలా కాకుండా ఇష్టమొచ్చిన ధరలకు విక్రయిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే సినిమా థియేటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.