inter exams: నేడు ఏపీ ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫలితాలు.. టీవీలో కూడా రిజల్ట్ చూసుకోవచ్చు!
- రాజమండ్రిలో పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్న గంటా
- రేపు వైజాగ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల విడుదల
- ఇంటర్ రిజల్ట్స్ విడుదలకు ఏర్పాట్లు పూర్తి
ఏపీ ఇంటర్మీడియెట్ సెకండియర్ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. రాజమహేంద్రవరంలోని షల్టన్ హోటల్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తైనట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ సారి పరీక్ష ఫలితాలు టీవీలో చూసుకునే వినూత్న అవకాశం కల్పించారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను టీవీలో నేరుగా ప్రసారం చేయనుంది. టీవీ తెరపై ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన సూచీ కనిపిస్తుందని, దీనిపై రిమోట్ తో ప్రెస్ చేసి, హాల్ టికెట్ నెంబర్ టైప్ చేస్తే విద్యార్థికి సంబంధించిన రిజల్ట్ టీవీ తెరపై కనబడుతుందని అధికారులు తెలిపారు. దీనితో పాటు 'పీపుల్స్ ఫస్ట్ సిటిజన్' మొబైల్ యాప్, 'ఏపీ సీఎం కనెక్ట్ ఖైజాలా' యాప్ ల ద్వారా కూడా ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలను మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు రాసినట్టు అధికారులు తెలిపారు. రేపు వైజాగ్ లో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.