BJP: బీజేపీ తొలి జాబితాపై కర్ణాటకలో ఎగసిపడిన అసంతృప్తి.. టికెట్లు అమ్ముకున్నారంటూ నిప్పులు!
- ఆగ్రహంతో ఊగిపోతున్న అసంతృప్త నేతలు
- రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం
- తల పట్టుకున్న బీజేపీ అధిష్ఠానం
- నష్టనివారణ చర్యలు ప్రారంభించిన యడ్డీ
వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న వేళ కర్ణాటక బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. బీజేపీ అధిష్ఠానం ఇటీవల విడుదల చేసిన 72 మందితో కూడిన తొలి జాబితాపై పలువురు భగ్గుమంటున్నారు. పార్టీని నమ్ముకున్న వారిని కాకుండా కాంగ్రెస్, జేడీఎస్ నుంచి వలస వచ్చిన నేతలకు టికెట్లు అమ్ముకున్నారంటూ కేంద్రమంత్రి అనంతకుమార్, ఆర్ఎస్ఎస్ నేత సంతోష్‌జీలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అసంతృప్త నేతలు రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలతో కలిసి నిరసనకు దిగారు. బెంగళూరులోని చిక్కపేట టికెట్‌ను తనకు కాకుండా పారిశ్రామికవేత్త గరుడాచార్‌కు ఇవ్వడంపై పార్టీ అధికార ప్రతినిధి ఎన్ఆర్ రమేశ్ ఫైరయ్యారు. ఆ సీటును అనంతకుమార్ రూ.2 కోట్లు అమ్మేసుకున్నారని ఆరోపించారు. మాజీ డిప్యూటీ సీఎం అర్. ఆశోకనే ఇందుకు కారణమంటూ ఆయన ఇంటి ఎదుట కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. అశోక తీరుకు నిరసనగా ఓ కార్యకర్త పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేయగా అడ్డుకున్నారు.
బెంగళూరు రాజరాజేశ్వరీనగర్ టికెట్ ఆశించి భంగపడిన సినీ నటి అమూల్య మామ రామచంద్రపై జేడీఎస్ కన్నేసింది. వీరిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. తనకు కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బసవనగౌడ పాటిల్ యత్నాల్‌కు టికెట్ ఇవ్వడంపై మాజీ మంత్రి అప్పు పట్టణశెట్టికి బీజాపూర్ టికెట్ ఇవ్వడంపై ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు.
మొళకాల్మూర్‌లో తిప్పేస్వామికి బదులుగా ఎంపీ బి.శ్రీరాములుకు టికెట్ ఇవ్వడంతో తిప్పేస్వామి రెబల్‌గా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఇక హవేరీ జిల్లా శిగ్గవి టికెట్ ఆశించి భంగపడిన ఎమ్మెల్సీ సోమణ్ణ బేవినమరద ఇండిపెండెంట్‌గా పోటీకి సిద్ధమయ్యారు. తొలి జాబితాకే అసంతృప్తుల సంఖ్య పెరిగిపోవడంతో మాజీ సీఎం యడ్యూరప్ప రంగంలోకి దిగారు. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు.