Chandrababu: 'ఆ దీక్ష విడ్డూరం'.. రేపటి మోదీ దీక్షపై చంద్రబాబు స్పందన
- వారు తప్పు చేశారు
- మనమేదో చేసినట్లు చిత్రీకరించేందుకే దీక్ష
- టీడీపీ 25 లోక్సభ స్థానాలూ గెలవాలి
- మన మాట వినే ప్రభుత్వం కేంద్రంలో వస్తుంది
పార్లమెంటు సమావేశాలు జరిగిన తీరుపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా సహా బీజేపీ ఎంపీలతో కలిసి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ దీక్షను కర్ణాటకలో చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, మోదీ దీక్షపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్ణాటక ఎన్నికల కోసం కావేరి బోర్డు ఏర్పాటు చేయకుండా అన్నాడీఎంకేతో మోదీ గొడవ చేయించారని అన్నారు.
అవినీతి ప్రక్షాళన చేస్తామని చెప్పిన మోదీ ఇప్పుడు వైసీపీలాంటి అవినీతిపరులతో జతకడుతున్నారని చంద్రబాబు అన్నారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోదీ చేసిన వాగ్దానాలను ఈ నెల 30న తాము తిరుపతి సభలో వినిపిస్తామని తెలిపారు. 'వారు తప్పుచేసి మనమేదో తప్పు చేసినట్లు చిత్రీకరించేందుకు మోదీ దీక్ష చేస్తాననడం విడ్డూర'మని చంద్రబాబు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 25 లోక్సభ స్థానాలనూ గెలవాలని, అప్పుడే మన మాట వినే ప్రభుత్వం కేంద్రంలో వస్తుందని అన్నారు.