Chandrababu: మోదీ సాయం చేయకపోతే.. వడ్డీతో సహా ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు: చంద్రబాబు
- ఏపీలో బీజేపీ లేనేలేదు
- మరో పార్టీ అండతో ఎగిరెగిరి పడుతోంది
- ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి.. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదు
బీజేపీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా బీజేపీ ఉందా? అని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ లేనేలేదని... కానీ, వేరే పార్టీ అండ చూసుకుని మాత్రం ఎగిరెగిరి పడుతోందని అన్నారు. టీడీపీతో పొత్తు వల్లే ఏపీలో బీజేపీ ఇప్పుడున్న సీట్లలో గెలిచిందని చెప్పారు. ప్రత్యేక హోదాకు సమానంగా అన్నీ ఇస్తామని ప్రధాని మోదీ చెబితేనే... తాను ప్యాకేజీకి ఒప్పుకున్నానని చెప్పారు. చివరకు ఏపీని దారుణంగా మోసం చేశారని... కేంద్ర మోసం అర్థమైన వెంటనే తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు చేసిందని తెలిపారు. ఏపీ కోసం అలుపు లేకుండా కష్టపడుతున్నానని చెప్పారు. విజయవాడలో జరిగిన జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వెనుకబడిన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ దేనని చంద్రబాబు చెప్పారు. టీడీపీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో విభేదాలు ఉన్నంత మాత్రాన ఏమీ కాదని... ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ఆగవని... మోదీ సాయం చేయకపోతే, వడ్డీతో సహా కేంద్రం నుంచి ఎలా సాధించుకోవాలో తమకు తెలుసని చెప్పారు.
తమిళనాడు ప్రజలు కావేరీ బోర్డు కోసం పోరాటాలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని... కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా పక్కన పెట్టేసిందని... కర్ణాటక ఎన్నికల కోసమే ఇదంతా చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ప్రధాని స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఇలా ప్రజల మనోభావాలతో ఆడుకోవడం సరికాదని చెప్పారు. వైసీపీ ఎంపీలవి నిజమైన రాజీనామాలు కావని... కేంద్రంతో రాజీపడి, రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని... ప్రజలకు నామాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.