New Delhi: ఫుల్ ఫోర్స్ తో వచ్చి బలవంతంగా వైసీపీ ఎంపీలను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు!
- హోదా కోసం దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీలు
- వారి ఆరోగ్యం క్షీణించిందని వైద్యుల రిపోర్టు
- అరెస్ట్ చేసి తరలించిన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్
- రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఎంపీల దీక్ష
ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ భవన్ లో ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలను ఢిల్లీ పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. దాదాపు వంద మందికి పైగా వచ్చిన పోలీసులు, కార్యకర్తలను చెదరగొడుతూ దీక్ష జరుగుతున్న ప్రాంతానికి వచ్చి, వైద్యులు ఇచ్చిన రిపోర్టును ప్రస్తావిస్తూ, అక్కడి నుంచి వెంటనే లేచి ఆసుపత్రికి బయలుదేరాలని, తమకు సహకరించాలని కోరారు.
దీనికి మిథున్, అవినాష్ లు ససేమిరా అనడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి, దీక్షలోని ఎంపీలను బలవంతంగా అంబులెన్స్ లోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, జై జగన్, జై వైఎస్సార్‌సీపీ అని కార్యకర్తలు నినాదాలు చేశారు. కాగా, గత ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీల బీపీ, షుగర్ లెవల్స్ పడిపోయాయని, వారింకా దీక్ష చేస్తే ప్రాణాలకు ప్రమాదమని ఈ ఉదయం వైద్యులు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, తాము ఆసుపత్రిలో కూడా దీక్ష చేస్తామని, విరమించే సమస్యే లేదని ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు.