USA: సిరియాపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా-రష్యా వాగ్యుద్ధం!
- సిరియాపై సైనిక చర్యకు పెంటగాన్ లో సమావేశం నిర్వహించిన ట్రంప్
- ఐక్యరాజ్యసమితిలో రష్యాపై తీవ్ర ఆరోపణలు చేసిన అమెరికా
- తేల్చుకుందాం వస్తారా? అంటూ సవాలు విసిరిన రష్యా
ఐక్యరాజ్యసమితి వేదికగా అగ్రరాజ్యాలు అమెరికా-రష్యాల రాయబారులు ఆరోపణలతో ఘాటుగా స్పందించడం ఆసక్తి రేపుతోంది. సిరియాలో మానవహక్కుల ఉల్లంఘనకు రష్యా కారణమని, అమెరికా ఆరోపిస్తుండగా, రష్యా కారణమని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో సిరియాపై ఉద్ధృతమైన సైనిక చర్యకు సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంటగాన్ అధికారులతో సమావేశమయ్యారు. సిరియాలోని దౌమాలో జరిగిన రసాయన ఆయుధ దాడిలో చిన్నపిల్లలు తీవ్రక్షోభను అనుభవిస్తూ మరణించడానికి కారణం రష్యా అని ట్రంప్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భద్రతామండలిలో అమెరికా- రష్యా తీవ్ర ఘర్షణ పడ్డాయి.
అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ, రసాయన దాడికి కారణం రష్యా- ఇరాన్ దేశాలేనని ఆరోపించారు. ఆ దేశాల మద్దతు లేకుండా సిరియా రసాయన దాడికి పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. సిరియా చిన్నారుల రక్తంతో రష్యా చేతులు ముద్దయ్యాయని ఆమె విమర్శించారు. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు, ఆధారాలను తాను చూపగలనని ఆమె తెలిపారు. వాటిని చూపించినా ప్రయోజనం ఉండదని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే ఆ దాడికి కారణమైన దుష్టశక్తికి మనస్సాక్షి లేదని ఆమె విమర్శించారు.
వెంటనే రష్యా ప్రతినిధి వాసిలీ నెబుంజెనియా ఆమెకు అడ్డుతగులుతూ, రసాయన దాడి జరిగిందనడానికి ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు. రసాయన దాడిలో సరీన్, క్లోరిన్ లు వాడినట్లు పరిశోధనలో తేలిందా? అని నిలదీశారు. రష్యాను వ్యతిరేకించే వారెవరైనా తనతో నిజానిజాలు తేల్చేందుకు రావాలని ఆయన సవాలు విసిరారు. దీంతో ఈ రసాయన దాడిపై దర్యాప్తును చేపట్టేందుకు ఐక్యరాజ్యసమితి బృందాన్ని పంపుదామంటూ అమెరికా ఒక తీర్మానం ప్రవేశపెట్టగా, దానిని రష్యా వ్యతిరేకించింది.