Dubai: సచిన్, రొనాల్డినో వంటి స్టార్లతో సన్నిహితంగా మెలిగిన ఇద్దరు గోవా మోసగాళ్లకు 500 ఏళ్ల జైలు శిక్ష
- 25 వేల డాలర్లు పెట్టుబడిగా పెడితే 120 శాతం రిటర్న్ ఇస్తానంటూ మోసం
- 200 మిలియన్ డాలర్ల కుంభకోణం
- ఫుట్‌బాల్ లీగ్‌లో గోవా జట్టుకు స్పాన్సర్ షిప్
తమ సంస్థ ఎఫ్‌సీ ప్రైమ్ మార్కెట్స్‌లో 25 వేల డాలర్లు పెట్టుబడిగా పెడితే ఏడాదికి 120 శాతం రిటర్న్స్ ఇస్తామని చెప్పి ఏకంగా 200 మిలియన్ డాలర్ల మోసానికి పాల్పడిన గోవాకు చెందిన ఇద్దరికి దుబాయ్ కోర్టు ఆదివారం 500 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. సిడ్నీ లెమోస్ (37), సీనియర్ అకౌంట్స్ స్పెషలిస్ట్ ర్యాన్ డి సౌజా (25) వేలాదిమంది పెట్టుబడిదారులను మోసం చేసినట్టు తేలడంతో వారికీ శిక్షలు విధించింది.
పెట్టుబడి దారులకు తొలుత లాభాలు పంచిన వీరిద్దరూ తర్వాత వాటిని ఆపేశారు. మార్చి 2016లో ఈ స్కీం కుప్పకూలింది. అదే ఏడాది జూలైలో దుబాయ్ ఎలక్ట్రానిక్ డిపార్ట్‌మెంట్ కంపెనీ కార్యాలయాలను మూసివేసింది. లెమోస్ భార్య వాలనీ కార్డోజోపై పోలీసులు గతేడాది డిసెంబరులో అక్రమ సంపాదన కింద కేసులు నమోదు చేసి కార్యాలయాన్ని సీజ్ చేశారు.
ఇండియన్ సూపర్ లీగ్‌లో ఎఫ్‌సీ ప్రైమ్ మార్కెట్స్ గోవా ఫ్రాంచైజీకి చెందిన ఎఫ్‌సీ గోవా ఫుట్‌బాల్ జట్టుకి ప్రిన్సిపల్ ఫ్రాంచైజీగా వ్యవహరించింది. ఫలితంగా సచిన్ టెండూల్కర్, అభిషేక్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్ వంటి స్టార్లతో లెమోస్‌కు పరిచయం పెరిగింది. అలాగే ఫుట్‌బాల్ దిగ్గజాలైన జికో, రోనాల్డినో వంటి వారితోనూ లెమోస్, ఆయన భార్య వాలనీలు దగ్గరయ్యారు.
గోవాలోని మపుసాకు చెందిన లెమోస్‌ను తొలుత డిసెంబరు 2016లో అరెస్ట్ చేశారు. అయితే ఆ వెంటనే బెయిలుపై విడుదలయ్యాడు. ఆ తర్వాత గతేడాది జనవరి మధ్యలో మరోసారి అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ అకౌంటెంట్ ర్యాన్ డి సౌజాను గతేడాది ఫిబ్రవరిలో దుబాయ్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. వాలనీ మాత్రం తప్పించుకుని గోవా పారిపోయింది.
కాగా, ఇది తుది తీర్పు కాదని లెమోస్ భార్య వాలనీ తెలిపింది. పెట్టుబడి దారులకు లెమోస్ ఒక్కడే న్యాయం చేయగలడని పేర్కొంది. అతడిపై నమోదైన 513 కేసు వల్లే అతడు దోషిగా మారాడని పేర్కొంది.