Kamal Haasan: రజనీకాంత్, కమలహాసన్‌లపై నిప్పులు చెరిగిన కన్నడ సీనియర్ నటుడు

  • నటులిద్దరూ ఫక్తు రాజకీయ నాయకులను తలపిస్తున్నారు
  • 138 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదం ఎప్పుడు పరిష్కారమవుతుంది?
  • శింబుకున్నపాటి తెలివి కూడా లేదా?
  • తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అనంత్ నాగ్

రాజకీయాల్లోకి వచ్చిన తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమలహాసన్‌లపై కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్ నిప్పులు చెరిగారు. కావేరీ జలాల పంపిణీ అంశంపై వీరు వ్యవహరిస్తున్న తీరును తూర్పారబట్టారు. కరుడు గట్టిన రాజకీయ నేతల్లా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.

కావేరీ జలాల పంపిణీ విషయంలో జరుగుతున్న వివాదంపై అనంత్ నాగ్ మాట్లాడుతూ.. కర్ణాటక, కావేరీ జలాల అంశంపై రజనీకాంత్, కమలహాసన్‌ల ధోరణి కొంత భిన్నంగా ఉంటుందని భావించామని, కానీ కరుడుగట్టిన రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోని విధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తమిళ రాజకీయ గూండాల బాటలోనే వీరిద్దరూ నడుస్తుండడం బాధాకరమన్నారు. తమిళ ప్రజలు చాలా మంచి వారని పేర్కొన్న అనంత్ నాగ్.. కమల్, రజనీ నుంచి భిన్నమైన రాజకీయాలను ఆశించానని పేర్కొన్నారు.

వచ్చే నెలలో కర్ణాటకలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని, అప్పటికైనా నటులిద్దరూ ఆగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. తమిళనాడుకు ఎంత వాటా వస్తుందో, ఆ వాటాను కర్ణాటక ఇవ్వాలని తమిళ యువ నటుడు శింబు అన్నాడని, ఆ మాత్రం పరిపక్వత కూడా వీరికి లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

తమిళ రాజకీయ నేతలు కావేరీ వివాదాన్ని పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేస్తున్నారని అనంత్‌ నాగ్ ఆరోపించారు. ఆఫ్రికాలో నైలు నది సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జల వివాదాలు పరిష్కారమయ్యాయని, కానీ, తమిళ నేతలు మాత్రం కావేరీ వివాదానికి మాత్రం పరిష్కారం చూపకుండా రాజకీయ ప్రయోజనాల కోసం చూసుకుంటున్నారని ఆరోపించారు.

138 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదం ఇంకెన్నాళ్లు కొనసాగాలని ప్రశ్నించారు. కన్నడిగుల మంచితనాన్ని చేతకాని తనంగా భావించవద్దని హెచ్చరించారు. కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైతే ఉద్యమంలో కూడా చేరడానికి తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. కాగా, అనంత్ నాగ్ కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ సహా 300 చిత్రాల్లో నటించారు. పలు జాతీయ అవార్డులను కూడా అందుకున్న ఆయన 1990లో జనతాదళ్ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 

Kamal Haasan
Rajinikanth
cauvery
Karnataka
Tamilnadu
Ananth Nag
  • Loading...

More Telugu News