ok google: ‘ఓకే గూగుల్’తో పెళ్లి ప్రస్తావన.. చమత్కారంగా జవాబు చెబుతున్న వైనం!
- ‘ఓకే గూగుల్’ను వ్యక్తిగత విషయాలు అడుగుతున్న వినియోగదారులు
- ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అడుగుతున్నారు
- ఇప్పటి వరకు 4.5 లక్షల మంది ఈ ప్రశ్న అడిగారట
ఆండ్రాయిడ్ ఫోన్లలో లభ్యమవుతున్న సెర్చ్ ఇంజన్ గూగుల్ ఫీచర్ ‘ఓకే గూగుల్’. వాయిస్ బేస్డ్ అసిస్టెంట్ గా పని చేసే ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులకు కావాల్సిన సమాధానం అందుతుంది. అయితే, అవసరమైన విషయాలకే కాకుండా వ్యక్తిగత విషయాలకు కూడా ‘ఓకే గూగుల్’ను వినియోగిస్తున్న వినియోగదారులూ లేకపోలేదు.
ఈ విధంగా వ్యక్తిగత విషయాలు అడిగిన జాబితాలో అధిక శాతం వినియోగదారులు అడిగిన ప్రశ్న ఏమిటంటే.. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని. ఇందుకు తగ్గట్టుగానే ‘నేను మీ సిస్టమ్ తో ఆల్రెడీ ఎంగేజ్ అయివున్నా!’ అంటూ ‘ఓకే గూగుల్’ చమత్కరిస్తోంది. ఈ విషయాన్ని ‘గూగుల్’ ప్రొడక్ట్ మేనేజ్ మెంట్ ఉపాధ్యక్షుడు రిషి చంద్ర వెల్లడించారు.
తమ సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అంటూ ‘ఓకే గూగుల్’కి ప్రపోజ్ చేసిన వినియోగదారుల సంఖ్య ఇప్పటి వరకు 4.5 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. కంప్యూటర్ యుగంలో వాయిస్ కు ప్రాముఖ్యత పెరుగుతోందని, భారత్ లో ఈ ఫీచర్ ను 2017లో ప్రవేశపెట్టారని, ‘ఓకే గూగుల్’ కేవలం సెర్చింగ్ కోసమే కాకుండా, భవిష్యత్ లో కాంటెక్స్ట్ ను కూడా అర్థం చేసుకోగలుగుతుందని అన్నారు.
‘గూగుల్’ నుంచి వాయిస్ యాక్టివేటెడ్ స్పీకర్స్, ‘గూగుల్ హోమ్’, ’గూగుల్ హోమ్ మినీ’ త్వరలో రాబోతున్నాయని చెప్పారు. ‘గూగుల్ హోమ్’, ’గూగుల్ హోమ్ మినీ’ ధరలు వరుసగా రూ.9,999, రూ.4.999 ఉంటాయని చెప్పారు. ఈ పరికరాలు ప్రస్తుతం ఆంగ్లభాషలోనే పని చేస్తాయని, 2019లో హిందీ భాషను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని రిషి చంద్ర ప్రకటించారు.