konaseema: జగన్ నిర్ణయం మార్చుకోకపోతే వైసీపీకి ‘శెట్టిబలిజ’ దూరమవడం ఖాయం : పిల్లి సుభాష్ చంద్రబోస్
- కోనసీమలో శెట్టిబలిజలకు ప్రాధాన్యమివ్వాలి
- ఈ కమ్యూనిటియే మా రాజకీయ ఎదుగుదలకు కారణం
- వారిని పట్టించుకోెకపోతే కష్టం
- మా బేస్ ని నాశనం చేసుకుని రాజకీయాల్లో మనుగడ సాధించలేం
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి శెట్టిబలిజ వర్గం షాక్ ఇచ్చింది. కోనసీమలో శెట్టిబలిజలకు వైసీపీ ప్రాధాన్యమివ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ కార్యక్రమాలకు శెట్టిబలిజ సామాజిక వర్గం దూరమైంది. దీక్షా శిబిరాల్లో ఉన్న శెట్టిబలిజ కార్యకర్తలను ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు తీసుకెళ్లిపోయారు.
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ‘ వైసీపీ అధినేత జగన్ నిర్ణయం మార్చుకోకపోతే శెట్టిబలిజ సామాజికవర్గం వైసీపీకి శాశ్వతంగా దూరమవుతుంది. మా కమ్యూనిటీయే మాకు బేస్. దానిని నాశనం చేసుకుని రాజకీయాల్లో మనుగడ సాధించలేం. మాకు రాజశేఖరరెడ్డిగారి మీదో, జగన్ గారి మీదో అత్యంత అభిమానం ఉన్నప్పటికీ మా బేస్ ను పాడు చేసుకుని రాజకీయాల్లో మనుగడ సాధించలేం. ఈ బేస్ ను కూలగొట్టుకుంటే మమ్మల్ని ఎవరూ పలకరించేవారు కూడా ఉండరు.
అందుచేత, కచ్చితంగా సంఘ నాయకుల మాట మేము విని తీరాలి. తాత్కాలికంగా ఓ నిర్ణయం తీసుకున్నాం. ‘మనందరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాం. మన విజ్ఞప్తిని మన్నించడం లేదు కాబట్టి..ముమ్మిడివరం శాసనసభా నియోజకవర్గంలో ప్రత్యేకించి కోనసీమలో మేమంతా ఒక ఏకాభిప్రాయంతో ఉన్నాం. మా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని మా విన్నపాన్ని వినే వరకూ పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా తాత్కాలికంగా బహిష్కరిస్తున్నాం.
దానికి మీ ఇధ్దరు (నేను, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి) సహకరించాలని సంఘనాయకులు కోరారు’ అని చెప్పారు. సంఘనాయకుల మాటను కచ్చితంగా శిరసావహిస్తామని పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు.