Kodandaram: సినిమా వాళ్లకు స్టేడియం ఇస్తారు.. కోదండరామ్ సభకు మాత్రం అనుమతి ఇవ్వరా?: వీహెచ్
- ఈ నెల 27న తెలంగాణ జన సమితి బహిరంగ సభకు యోచన
- అనుమతి ఇవ్వని పోలీసులు
- ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతగా నిర్బంధం లేదన్న వీహెచ్
- రాష్ట్ర పాలన దొరల పాలనను తలపిస్తోందని మండిపాటు
తెలంగాణ జన సమితి పేరుతో కొత్త పార్టీ పెట్టిన టీజేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరామ్ ఈ నెల 27న బహిరంగ సభ నిర్వహించి, తమ పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్న విషయం తెలిసిందే. అయితే, సరూర్‌నగర్‌లో ఆ సభకు అనుమతి కోరుతూ టీజేఏసీ చేసుకున్న దరఖాస్తును పోలీసులు తిరస్కరించారని, అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కూడా ఆ దరఖాస్తును తిరస్కరించారని సదరు పార్టీ నేతలు తెలిపారు.
ఈ విషయంపై స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు కేసీఆర్ సర్కారుపై మండిపడ్డారు. సినిమా వాళ్లకు స్టేడియాలు ఇస్తోన్న సర్కారు.. ప్రొ.కోదండరామ్ నిర్వహించనున్న సభలకు మాత్రం ఇవ్వదా? అని ఆయన నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతగా నిర్బంధం లేదని, ఇప్పుడు రాష్ట్ర పాలన దొరల పాలనను తలపిస్తోందని అన్నారు. ఆ సభకు అనుమతి ఇవ్వకపోతే తెలంగాణ సునామీగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.