Uttar Pradesh: పడగొట్టిన అంబేద్కర్ విగ్రహం పునఃప్రతిష్ఠ... యూపీలో విమర్శలు కొని తెచ్చుకున్న బీజేపీ!
- అంబేద్కర్ దుస్తులను మార్చేసిన అధికారులు
- ప్యాంట్, కోట్ స్థానంలో లాల్చీ, జుబ్బా
- కాషాయపు రంగు వేయడంపైనా విమర్శలు
ఉత్తరప్రదేశ్ లో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించిన బీజేపీ, విమర్శలు కొని తెచ్చుకుంది. ఈ నెల 7వ తేదీన బదాన్ ప్రాంతంలోని దుగ్రాయా గ్రామంలో ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు తిరిగి ప్రతిష్ఠించారు. అయితే, అంబేద్కర్ ధరించే సూట్ కు సాధారణంగా ఉండే నలుపు లేదా నీలిరంగు స్థానంలో కాషాయపు రంగు వేయడమే విమర్శలకు తావిచ్చింది.
ఇదే సమయంలో ప్యాంట్, కోట్ బదులుగా, తెల్లని లాల్చీ, కాషాయపు రంగు జుబ్బా ధరించినట్టుగా అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు తయారు చేయించారు. దానికి ఓకే చెప్పడమే కాకుండా, దాన్ని సమర్థించిన బీజేపీపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమై అధికారులను ప్రశ్నించగా, వారి నుంచి ఎటువంటి స్పందనా రాకపోవడం గమనార్హం. ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం విపక్షాలకు అలవాటై పోయిందని, భారత సంస్కృతికి చిహ్నమైన కాషాయపు రంగును విగ్రహం దుస్తులకు వేస్తే ఏమైందని స్థానిక బీజేపీ నేత ప్రేమ్ స్వరూప్ పాథక్ ప్రశ్నిస్తుండటం గమనార్హం.