Cooking Gas: మోదీ నయా ప్లాన్... వంట గ్యాస్ కనెక్షన్ కూ వాయిదా పద్ధతి!
- మరో ప్రజాకర్షక పథకానికి రూపకల్పన
- తెలుగు రాష్ట్రాల నుంచే మొదలు
- రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా పథకం
- రూపాయి కట్టకుండానే గ్యాస్ సిలిండర్, స్టవ్
ప్రధాని నరేంద్ర మోదీ మరో ప్రజాకర్షక సంక్షేమ పథకానికి రూపకల్పన చేశారు. వంట గ్యాస్ కనెక్షన్ కావాలని కోరుకునే వారి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంబేద్కర్ జయంతి రోజున ఈ పథకం తొలుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు విధివిధానాలకు రూపకల్పన చేస్తూ, లబ్దిదారుల ఎంపిక బాధ్యత చమురు సంస్థలు, డీలర్లదేనని కూడా కేంద్రం ఆదేశించింది.
కనెక్షన్ కు కట్టాల్సిన డబ్బును వాయిదాల రూపంలో లబ్దిదారుల నుంచి వసూలు చేయాలని, గ్యాస్ కొనుగోలు తరువాత కస్టమర్ల ఖాతాల్లో జమ అయ్యే సబ్సిడీని అందుకు జమ చేసుకుంటూ వెళ్లాలని ఆదేశించింది. ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఎంత మాత్రం ప్రమేయం ఉండరాదని సూచించింది.
కాగా, ఈ పథకం ప్రారంభించే నాడు పలువురు కేంద్ర మంత్రులు తెలుగు రాష్ట్రాలకు వస్తారని సమాచారం. పథకం ప్రచార చిత్రాలను సైతం కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి పంపింది. ప్రస్తుతం ఒక్కో గ్యాస్ కనెక్షన్ కు రూ. 1600 (గ్యాస్ సిలిండర్ కు రూ. 700, స్టవ్ కు రూ. 900) వరకూ కట్టాల్సి వుండగా, ఈ మొత్తాన్ని గ్యాస్ కొనుగోలు తరువాత బ్యాంకులో వేసే సబ్సిడీ నుంచి మినహాయించుకుంటారు. ఏడో సిలిండర్ తీసుకున్న తరువాత లబ్దిదారుల బ్యాంకు ఖాతా నుంచి సబ్సిడీ మొత్తాన్ని వాయిదాల రూపేణా తీసుకుంటారు. అంబేద్కర్ జయంతి రోజున ప్రతి డీలర్ కనీసం 500 మందిని సమీకరించి, వారి కళ్లముందే 100 మందికి కొత్త కనెక్షన్లు అందించాలని తెలుగు రాష్ట్రాల్లోని డీలర్లకు చమురు సంస్థలు ఆదేశాలు పంపాయి. స్థానికంగా అందుబాటులో ఉండే సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని కూడా కేంద్రం సూచించింది.