Bihar: బీహార్ యూనివర్సిటీ వికృత చర్య.. లోదుస్తులతో ఉన్న ఫొటోతో విద్యార్థినికి అడ్మిట్ కార్డు!
- అడ్మిట్ కార్డుపై యువతి ఫొటోకు బదులు అసభ్యకరంగా ఉన్న మరో ఫొటో
- షాక్‌కు గురైన యువతి.. కొత్త కార్డు కోసం డిమాండ్
- ఈసారి ఫొటో లేకుండానే వచ్చిన కార్డు
- వివాదాస్పదమైన యూనివర్సిటీ తీరు
బీహార్‌లోని దర్భంగాలో ఉన్న లలిత్ నారాయణ్ మహిళా యూనివర్సిటీ జారీ చేసిన ఓ అడ్మిట్ కార్డు ఇప్పుడు వివాదాస్పదమైంది. పరీక్షల కోసం అనుబంధ యూనివర్సిటీ విద్యార్థినికి లోదుస్తులతో ఉన్న మహిళ ఫొటోను అతికించిన అడ్మిట్ కార్డును జారీ చేసింది. అడ్మిట్ కార్డు చూసి షాకైన హోం సైన్స్ చదువుతున్న యువతి అధికారులకు ఫిర్యాదు చేసింది.
తన ఫొటోతో ఉన్న అడ్మిట్ కార్డును తిరిగి జారీ చేయాలని సోమవారం డిమాండ్ చేసింది. పరీక్షలు నేటి (మంగళవారం) నుంచి ప్రారంభం కానుండడంతో సోమవారమే కొత్త అడ్మిట్ కార్డు ఇవ్వాలని కోరింది. అడ్మిట్ కార్డులో అన్ని వివరాలను సరిచూసుకున్నాక ప్రింట్ అవుట్ తీసుకున్న తాను షాక్‌కు గురయ్యానని, తన ఫొటోకు బదులుగా లోదుస్తులతో ఉన్న యువతి ఫొటో ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటనపై యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి కులానంద్ యాదవ్ మాట్లాడుతూ ఇటువంటివి సహించబోమని, వెంటనే అసభ్యకరంగా ఉన్న ఆ ఫొటోను తొలగించి విద్యార్థిని ఫొటోతో ఉన్న మరో అడ్మిట్ కార్డును జారీ చేయాలని ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం మరోమారు అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోగా దానిపై ఫొటో, సంతకం లేకుండా ఖాళీగా కనిపించింది. దీంతో ఈ వ్యవహారం మరోమారు వివాదాస్పదమైంది. దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందిస్తూ తప్పు తమది కాదని చెప్పి తప్పుకున్నారు. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని నియంత్రణాధికారి యాదవ్ చెప్పారు.