Tirumala: నాడు మోదీ నిలబడ్డ చోటే నిలబడి నినదిస్తా!: చంద్రబాబు

  • తిరుపతిలో 30న బహిరంగ సభ
  • ఆపై నెలకు ఓ జిల్లాలో సభ, అఖిలపక్ష సమావేశం
  • మోదీ ఇచ్చిన హామీల అమలుకు ఒత్తిడే లక్ష్యం

దాదాపు నాలుగున్నర సంవత్సరాల క్రితం తిరుమల వెంకన్న సాక్షిగా, తిరుపతిలో మోదీ ప్రజలకు ఎక్కడైతే ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ తదితరాంశాలపై హామీ ఇచ్చారో, అదే ప్రాంతంలో నిలబడి, హామీల అమలుకు నినదిస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. నాడు ఎన్నికల సభలో మోదీ ఇచ్చిన హామీని గుర్తు చేయడమే లక్ష్యంగా ఈనెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన అన్నారు.

ఆ తరువాత నెలకు ఒక జిల్లాలో సభ, ప్రతి జిల్లాలో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ వ్యూహ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తామని, క్యాపిటల్ నిర్మాణానికి పూర్తి నిధులు ఇస్తామని నాడు మోదీ చేసిన హామీలను గుర్తు చేయడమే ఈ సభల లక్ష్యమని చెప్పారు.

కేంద్రంపై పోరాడే క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన ఆయన, 14న అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 20న గుంటూరు జిల్లా నాగార్జున వర్శిటీ ఎదురుగా, లక్ష మంది దళిత, క్రైస్తవులతో  'తెదేపా-దళిత తేజం విజయోత్సవ సభ', 11న మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని నిర్వహించనున్నట్టు చంద్రబాబు తెలిపారు. అవినీతి రాజకీయాలకు పాల్పడిన వారితో కేంద్రంలోని బీజేపీ కుమ్మక్కై, తెలుగుదేశం పార్టీ మీద కుట్ర పన్నుతున్నారని వ్యాఖ్యానించిన చంద్రబాబు, కేంద్రం కుట్రను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News