Australia: ఆ బామ్మ చేసిన పనికి విమానాశ్రయం మొత్తం అలెర్ట్ చేసిన అధికారులు!
- ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ విమానాశ్రయంలో దిగిన ముంబయ్ బామ్మ
- బ్యాగుపై 'బాంబ్ టూ బ్రిస్బేన్' అని రాసుకున్న వైనం
- ఇంగ్లిష్ తెలియకే గందరగోళం అని తేల్చిన అధికారులు
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ విమానాశ్రయంలో ముంబయికి చెందిన ఓ బామ్మ అధికారులను కంగారు పెట్టించింది. ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిన ఆ బామ్మ బ్రిస్బేన్ విమానాశ్రయంలో దిగగానే ఆమె బ్యాగుపై రాసి ఉన్న విషయాన్ని చూసిన అధికారుల్లో ఆందోళన చెలరేగింది. ఎందుకంటే ఆ బ్యాగుపై 'బాంబ్ టూ బ్రిస్బేన్' అని రాసి ఉంది.
దీంతో ఆమెను ప్రత్యేక గదిలో అధికారులు విచారించగా అసలు విషయం తెలిసింది. ఆమెకు ఇంగ్లిష్ సరిగ్గా రాని కారణంగా తన బ్యాగ్‌పై బాంబే టూ బ్రిస్బేన్ రాసుకునే బదులు 'బాంబ్ టూ బ్రిస్బేన్' అని రాసుకుందని అధికారులు తెలుసుకున్నారు. ఆ బ్యాగ్‌లో బాంబ్ ఉందేమోనన్న అనుమానంతో తాము ఎయిర్‌పోర్టు మొత్తం అలెర్ట్ చేశామని చెప్పారు. వాస్తవాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఆ బామ్మను వదిలేసినట్లు తెలిసింది.