Jana Sena: పవన్ కల్యాణ్‌పై జగన్ చేసిన విమర్శలపై మండిపడ్డ జనసేన
- మా అధ్యక్షుడు పవన్ ప్రజలతోనే ఉన్నారు
- జగన్ మాత్రం శాసనసభను వదిలారు
- ప్రజల సమస్యలు కూడా వదిలేశారు
- పవన్ కల్యాణ్ ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్నారు
తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమైనవని జనసేన నేతలు అన్నారు. తమ అధ్యక్షుడు పవన్ ప్రజలతోనే ఉన్నారని, ప్రతిపక్ష నేత అయిన జగన్ మాత్రం శాసనసభను వదిలి, ప్రజల సమస్యలు వదిలేశారని విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రజల సమస్యల పట్ల స్పందిస్తున్నారని, అవిశ్వాసం విషయంలో ఆ పార్టీకైనా, టీడీపీకైనా దిక్సూచిగా నిలిచింది పవన్ కల్యాణే అన్న సంగతి మరచిపోవద్దని కౌంటర్ ఇచ్చారు.
ఈ రోజు హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో జనసేన ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, పార్టీ ప్రతినిధులు అద్దేపల్లి శ్రీధర్, పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ... ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడేవాళ్లందరికీ జనసేన అండగా ఉంటుందని అన్నారు. ఢిల్లీలో రాష్ట్రం కోసం నిరసనలు, ఆమరణ దీక్షలు చేస్తోన్న ఎంపీలకు సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
"ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఎంపీలు నాలుగు రోజులుగా ఆమరణ దీక్షలు చేస్తున్నారు. వయసులో పెద్దవాళ్లైన ముగ్గురు ఎంపీలు ఇప్పటికే ఆసుపత్రిలో చేరారు. తెలుగుదేశం ఎంపీలు ప్రధాన మంత్రి నివాసం ముందు నిరసన తెలియచేస్తే వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన తీరు ఏ మాత్రం గౌరవప్రదంగా లేదు. ప్రజా ప్రతినిధుల పట్ల వ్యవహరించే తీరు అది కాదు. ఢిల్లీలో నిరసనలు చేస్తోన్న ఈ రెండు పార్టీల ఎంపీలకీ జనసేన సంఘీభావం తెలుపుతోంది.
అయితే, వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన తీరు సరిగా లేదు. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడ్డాకా చేస్తే ఎప్పటికి ఆమోదం పొందాలి. సభ నడుస్తోన్న సమయంలో రాజీనామాలు ఇస్తేనే ఆమోదం పొందుతాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకి న్యాయం జరగాలంటే లోక్ సభ, రాజ్యసభ సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. మా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఒక్క పిలుపు
ఇస్తే విజయవాడలో పాదయాత్రకి 40 వేల మంది వచ్చారు.
రాష్ట్రంలో పలు చోట్ల పాదయాత్రలు చేశారు. పవన్ కల్యాణ్ వెంట ఉండేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పవన్ పాదయాత్ర పిలుపు ఇచ్చాకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హడావుడిగా సైకిల్ యాత్ర అన్నారు. ఆయన, వాళ్ల అబ్బాయి లోకేశ్ చేసిన యాత్రలని జనం చూశారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో వెనకడుగు వేస్తోంది.
బీజేపీని నిలదీయడంలో రాష్ట్ర అధికార, ప్రతిపక్షాలు విఫలమవుతున్నాయి. ఆ రెండు పార్టీలు కేసుల భయంతో బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసి అడగటం లేదని ప్రజల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలో చెప్పిన అంశాలు అమలు చేసేలా జనసేన ప్రజా క్షేత్రంలోనే పోరాటం చేస్తోంది. ఈ కార్యాచరణతో అధికార ప్రతిపక్షాలకి నిద్ర లేకుండా చేస్తాం' అని శ్రీధర్ అన్నారు.