chanda kochar: ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచర్ కు పదవీ గండం? రాజీనామాకు అవకాశాలు
- వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరులో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు
- దీనిపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు
- రాజీనామా చేయాలంటూ బోర్డులో కొందరు సభ్యుల నుంచి డిమాండ్లు
వీడియోకాన్ గ్రూపునకు రూ.3,250 కోట్ల రుణం మంజూరు వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు బ్యాంకు సీఈవో చందాకొచ్చర్ పదవికి ఎసరు పెట్టేట్టు ఉన్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు సీఈవోగా చందా కొచర్ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి వరకు ఉంది. వీడియోకాన్ గ్రూపునకు రుణం మంజూరు చేసినందుకు గాను ఆ సంస్థ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ ఆ తర్వాత చందాకొచర్ భర్త దీపక్ కొచర్ ఏర్పాటు చేసిన కంపెనీలోకి రూ.60 కోట్లకు పైగా నిధులు సమకూర్చినట్టు ఆరోపణలు వచ్చాయి. రుణం ఇచ్చినందుకు ప్రతిఫలంగానే ఇది ముట్టజెప్పినట్టు వార్తలు రావడంతో సీబీఐ ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టింది.
దీంతో చందా కొచర్ తన పదవికి రాజీనామా చేయాలని ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు నుంచి ఒత్తిడి పెరుగుతోంది. రుణం మంజూరులో చందాకొచర్ ప్రమేయం ఏదీ లేదంటూ ఇటీవలే బ్యాంకు బోర్డు ఆమెకు మద్దతుగా నిలిచిన విషయం విదితమే. అయితే, బోర్డులో కొందరు ఆమె తప్పుకుంటే బావుంటుందని కోరుతుంటే, మరికొందరు ఆమె కొనసాగాలని ఆశిస్తున్నట్టు సమాాచారం వినిపిస్తోంది. దీంతో ఆమె తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఐసీఐసీఐ బ్యాంకును ప్రైవేటు రంగంలో నంబర్ 2 బ్యాంకుగా నిలబెట్టడంలో చందాకొచర్ పాత్ర ఎంతో విలువైనది. సంస్థలో మూడు దశాబ్దాలుగా ఆమె పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా ఆమె ఎన్నో పర్యాయాలు గుర్తింపు పొందారు.