Telugudesam: రాజ్ ఘాట్ వద్ద దీక్షకు దిగిన టీడీపీ ఎంపీలు
- రాజ్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టిన టీడీపీ ఎంపీలు
- మహాత్ముడికి నివాళి అర్పించిన నేతలు
- తెల్లటి దుస్తులు ధరించి, నల్ల బ్యాడ్జీలతో నిరసన
ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వడంతో పాటు, విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ప్రధాని నివాసం సమీపంలో టీడీపీ ఎంపీలు నిన్న ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా, ఈ ఉదయం వారు గాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్ద దీక్ష చేపట్టారు.
తొలుత ఎంపీ తోట నర్సింహం నివాసంలో సమావేశమైన ఎంపీలు అక్కడి నుంచి నేరుగా రాజ్ ఘాట్ కు వెళ్లారు. అనంతరం అక్కడ మహాత్ముడికి నివాళి అర్పించారు. ఆ తర్వాత మౌన దీక్షకు దిగారు. శాంతి యుతంగా తమ నిరసనను తెలుపుతున్నారు. అంతకు ముందు ఎంపీలు మాట్లాడుతూ, విభజన హామీలను నెరవేర్చాల్సిందేనని... అంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీలంతా తెల్లటి దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించారు.