NDA: కేంద్ర ఉద్యోగులకు ఎన్నికల తాయిలం... వేతనాలు, పదవీ విరమణ వయసు పెంపుపై కసరత్తు!
- ఏడో వేతన సంఘం సిఫార్సులను మించిన వేతనం
- ఎన్నికలకు ముందే పెంచే ఆలోచనలో ఎన్డీయే
- ఫిట్ మెంట్ ను కూడా పెంచాలని ఉద్యోగుల డిమాండ్
సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవాలని భావిస్తున్న ఎన్డీయే సర్కారు, ఏడో వేతన సంఘం సిఫార్సులను మించిన వేతనాలు ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం మోదీ సర్కారు కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. కనీస వేతనాన్ని పెంచకుండా, వారికి మరిత మొత్తం జీతం వచ్చేలా చూడటమే కేంద్రం ఉద్దేశంగా తెలుస్తోంది. కాగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు జూన్ 2016లో పెరిగాయన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కనీస వేతనాన్ని రూ. 7 వేల నుంచి రూ. 18 వేలకు పెంచారు. దీన్ని రూ. 26 వేలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇదే సమయంలో 2.57 రెట్లుగా ఉన్న ఫిట్ మెంట్ ను 3.68 రెట్లకు పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా రిటైర్ మెంట్ వయసును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు కూడా పెంచాలని కూడా కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఉద్యోగుల వేతనాలను పెంచే యోచనలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పీ రాధాకృష్ణన్ ఇటీవలి పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే.