ysrcp: క్షీణించిన మేకపాటి ఆరోగ్యం... వెంటనే దీక్ష విరమించకుంటే ప్రమాదమన్న వైద్యులు!
- తీవ్రమైన తలనొప్పి, హై బీపీతో బాధపడుతున్న మేకపాటి
- 73 ఏళ్ల వయసులో ఈ తరహా దీక్షలు వద్దు
- ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుందని వైద్యుల హెచ్చరిక
- నేడు మేకపాటిని పరామర్శించనున్న విజయమ్మ
గడచిన మూడు రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ, న్యూఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న వైసీపీ ఎంపీల్లో ఒకరైన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయన వెంటనే దీక్షను విరమించాలని వైద్యులు సూచించారు. ఆయన తీవ్రమైన తలనొప్పి, హై బీపీతో బాధపడుతున్న మేకపాటి, దీక్షను కొనసాగిస్తే, ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరించినట్టు వైకాపా వర్గాలు తెలిపాయి. 73 సంవత్సరాల వయసులో ఇప్పటికే పలు రకాల రుగ్మతలతో బాధపడుతున్న ఆయన, తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దీక్ష చేయడం మంచిది కాదని హెచ్చరించారు. కాగా, నిన్న ఆయన్ను పోలీసులు బలవంతంగా రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించిన సంగతి తెలిసిందే. ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు వైద్యులు యత్నించగా, నిరాకరించిన మేకపాటి, ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. కాగా, మరికాసేపట్లో వైఎస్ జగన్ తల్లి విజయమ్మ ఆసుపత్రికి వెళ్లి మేకపాటిని పరామర్శించనున్నారు. అనంతరం ఏపీ భవన్ కు వెళ్లే విజయమ్మ, ఎంపీల దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలపనున్నారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు ఏపీ భవన్ లో తమ ఆమరణ దీక్షను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.