H1B Visa: ఐదు రోజుల్లోనే వెల్లువలా వచ్చిన హెచ్ 1బీ దరఖాస్తులు... ముగిసిన కోటా, త్వరలో లక్కీ డ్రా
- అందుబాటులో 65,000 వీసాలు
- అంతకంటే ఎక్కువే వచ్చిన దరఖాస్తులు
- ఎంపిక కాని వారికి ఫీజుల వాపసు
అమెరికాలో నైపుణ్య ఉద్యోగాల కోసం ఇచ్చే హెచ్ 1బీ వీసాల కోసం ఈ సారి స్పందన ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే 2019 ఆర్థిక సంవత్సరం కోసం 65,000 వీసాలు అందుబాటులో ఉండగా, ఈ నెల 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అయితే, నిర్ణీత కోటా కంటే ఎక్కువే దరఖాస్తులు వచ్చేశాయని త్వరలోనే లక్కీ డ్రా తీసి విజేతలను ఎంపిక చేస్తామని అమెరిక పౌర, వలస సేవల విభాగం ప్రకటించింది. కచ్చితంగా ఎన్ని దరఖాస్తులు వచ్చాయన్నది వెల్లడించలేదు.
అమెరికాలో పనిచేసే కంపెనీలు నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఈ వీసాలు ఉపకరిస్తాయి. 65,000 కోటాకు అదనంగా మాస్టర్ డిగ్రీ అర్హత కలిగిన వారి కోసం ఉద్దేశించిన 20,000 వీసాలకు కూడా తగినన్ని దరఖాస్తులు వచ్చినట్టు అమెరికా పౌర, వలస సేవల విభాగం తెలిపింది. కొన్ని వారాల వరకు దరఖాస్తులకు సంబంధించి కచ్చితమైన గణాంకాలు తెలియవని పేర్కొంది. గతేడాది మాదిరే వచ్చిన దరఖాస్తుల నుంచి లక్కీ డ్రా ద్వారా ఎంపిక ఉంటుందని, ఎంపిక కాని వారికి దరఖాస్తు ఫీజులను వాపసు చేయడం జరుగుతుందని తెలిపింది.