Pawan Kalyan: ఆస్తులేమో తెలంగాణకి, అప్పులేమో ఆంధ్రాకి ఇచ్చారు: పవన్ కల్యాణ్
- రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు
- ఏపీకి అన్యాయం చేశారు
- కేంద్ర సర్కారుపై మొదట టీడీపీ, వైసీపీ పోరాడలేదు
- నేనే మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించా
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని, ఏపీకి అన్యాయం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు తన పాదయాత్ర ముగిసిన తరువాత విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఆస్తులేమో తెలంగాణకి, అప్పులేమో ఆంధ్రాకి ఇచ్చారని అన్నారు. విభజన హామీలు నెరవేర్చుతారేమోనని ఎన్నికలు జరిగిన ఏడాది పాటు వేచి చూశామని, రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేంద్ర ప్రభుత్వంపై మొదటి నుంచి పోరాటం చేయలేకపోయాయని చెప్పారు.
తానే మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న అన్యాయంపై తమ పార్టీ సభలో మాట్లాడానని, ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలని చెప్పానని, అయినప్పటికీ ఆ పాచిపోయిన లడ్డూలే కావాలని చంద్రబాబు అన్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ సమర్థవంతమైన పాత్ర నిర్వహించలేకపోయిందని, వామపక్ష పార్టీలతో కలిసి జనసేన పోరాడుతోందని అన్నారు.
మొదట్లో ప్రత్యేక హోదా ఇస్తామన్నారని, ఆ తరువాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారని అది కూడా ఇవ్వలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. విభజనతో నష్టపోయిన ఏపీకి సీనియర్ నాయకుడి అనుభవం కావాలనే తాను గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతిచ్చానని చెప్పారు. ఏపీలో వెనుకబడిన జిల్లాలపై ఎవ్వరూ మాట్లాడడం లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరుద్ధ ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయని విమర్శించారు.