shoaib akhtar: సల్మాన్ ఖాన్ కు విధించిన శిక్ష చాలా కఠినంగా ఉందన్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అక్తర్
- నా స్నేహితుడికి జైలు శిక్ష పడడం విచారకరం
- అయినా కోర్టు తీర్పును గౌరవించాల్సిందే
- బయటకు వస్తాడన్న నమ్మకం ఉందంటూ ట్వీట్
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ భారత నటుడు సల్మాన్ ఖాన్ కు కోర్టు విధించిన శిక్షపై స్పందించాడు. తన స్నేహితుడైన సల్మాన్ ఖాన్ కు కోర్టు విధించిన శిక్ష కఠినంగా ఉందన్నాడు. రెండు కృష్ణ జింకల వేట కేసులో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ కు ఐదేళ్ల కారాగార శిక్ష విధిస్తూ నిన్న తీర్పునిచ్చిన విషయం విదితమే. దీంతో ఆయన్ను జోధ్ పూర్ జైలుకు పోలీసులు తరలించారు.
దీంతో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... ‘‘నా స్నేహితుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడడం నిజంగా విచారకరం. అయినప్పటికీ చట్టం తన పని తాను చేయాలి. భారత కోర్టు నిర్ణయాన్ని మనం గౌరవించాలి. కానీ, నా ఉద్దేశ్యంలో శిక్ష చాలా కఠినంగా ఉంది. సల్మాన్ కుటుంబ సభ్యులు, అభిమానులకు నా మద్దతు తెలుపుతున్నాను. అతను కచ్చితంగా బయటకు వస్తాడన్న నమ్మకం నాకు ఉంది’’ అని అక్తర్ ట్వీట్ చేశాడు. అటవీ చట్టాల కింద సల్మాన్ ఖాన్ ను ‘అలవాటుగా మారిన నిందితుడి’గా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్ కుమార్ ఖత్రి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.