ipl: భారత అభిమానులను మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన అఫ్రిది
- రెండు రోజుల క్రితం ట్విట్టర్ లో కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
- ఐపీఎల్ పై యూటర్న్ తీసుకున్న వైనం
- పీఎస్ఎల్ వేగంగా ఎదుగుతోందన్న అఫ్రిది
కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి, భారతీయుల ఆగ్రహానికి గురైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి భారత అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఐపీఎల్ సీజన్-11 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒక వెబ్ సైట్ తో మాట్లాడుతూ, ఐపీఎల్ లో ఆడే అవకాశమిచ్చినా ఆడనని అన్నాడు. గతంలో ఐపీఎల్ తొలి సీజన్ లో డెక్కన్ ఛార్జర్స్ కు ప్రాతినిధ్యం వహించిన తరువాత అఫ్రిది మాట్లాడుతూ, ‘నేనొక్కసారే ఐపీఎల్ లో ఆడాను. ఐపీఎల్ ఒక గొప్ప టోర్నీ. ఆ లీగ్ లో ఆడటం ప్రత్యేక అనుభూతి కలిగించింది’ అంటూ వ్యాఖ్యానించాడు.
అయితే ఆ తరువాత యూటర్న్ తీసుకుని, ఐపీఎల్ కంటే పీఎస్ఎల్ వేగంగా ఎదుగుతుందని అన్నాడు. ప్రస్తుతం తాను పీఎస్‌ఎల్ ను ఆస్వాదిస్తున్నానని, ఐపీఎల్ లో ఆడాల్సిన అవసరం తనకు లేదని అన్నాడు. అంతే కాకుండా అసలు ఐపీఎల్ అంటే ఆసక్తే లేదని పేర్కొన్నాడు. దీనిపై అభిమానులు మండిపడుతున్నారు. పాక్ క్రికెటర్లకు భారత్ లో ఆడే అవకాశం ఎక్కడిది? అని పలువురు నెటిజన్లు అఫ్రిదిని ప్రశ్నిస్తున్నారు.