Tobaco: పొగాకు ఉత్పత్తులపై మరింత భయంకరంగా కనిపించనున్న హెచ్చరిక చిత్రాలు... విడుదల చేసిన కేంద్రం!
- మరింత భయానకంగా హెచ్చరికల చిత్రాలు
- రెండు పిక్చర్స్ విడుదల
- ప్యాకెట్లపై టోల్ ఫ్రీ నంబర్ కూడా తప్పనిసరి
- కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు
ప్రజలతో పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ఎలాగైనా మాన్పించాలన్న ఉద్దేశంతో ఉన్న కేంద్రం, సిగరెట్లు, గుట్కాలు, ఖైనీలు తదితరాలపై ముద్రించే చిత్రాలను మరింత భయానకంగా తయారు చేసింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్ నిబంధనలను మారుస్తూ, ఆరోగ్య హెచ్చరికల చిత్రాలను మారుస్తున్నట్టు చెబుతూ, రెండు పిక్చర్స్ విడుదల చేసింది. ఈ మేరకు రెండు సెట్ల ఇమేజ్ లను విడుదల చేస్తూ, తొలి సెట్ 12 నెలల పాటు అన్ని పొగాకు ఉత్పత్తులపై ముద్రించాలని, ఆపై రెండో సెట్ బొమ్మలను ముద్రించాలని తేల్చింది.
ఇదే సమయంలో పొగాకు వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరించే టోల్ ఫ్రీ నంబర్ '1800-11-2356'ను విధిగా ప్రతి ప్యాక్ పై ముద్రించాలని ఆదేశించింది. కాగా, ప్రస్తుతం సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లపై ఉన్న హెచ్చరికల చిత్రాలతో పోలిస్తే ఇవి మరింత భయానకంగా ఉండటం గమనార్హం. గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే వెల్లడించిన నివేదిక ప్రకారం, ప్రస్తుతం సిగరెట్లు తాగుతున్న వారిలో 15 ఏళ్లలోపు వారు కూడా ఉన్నారని వెల్లడైన సంగతి తెలిసిందే. కొత్త హెచ్చరికల చిత్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.