Soumya: సౌమ్యను హత్య చేసిందెవరు?: అంతుచిక్కని కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన పోలీసు బాస్ లు!
- ఐదు రోజుల క్రితం సౌమ్య హత్య
- ఒక్క ఆధారాన్నీ కనిపెట్టలేకపోయిన పోలీసులు
- కేసును ఛాలెంజ్ గా తీసుకున్న యంత్రాంగం
- నిందితుడిని పట్టుకు తీరుతామంటున్న పోలీసులు
సౌమ్య... ఐదు రోజుల క్రితం హైదరాబాద్ ఎర్రగడ్డ సమీపంలోని సూర్య ఆర్కేడ్ లో హత్యకు గురైన యువతి. హత్య జరిగి ఐదు రోజులైనా ఇంతవరకూ ఒక్క చిన్న ఆధారం కూడా పోలీసులకు చిక్కక పోవడంతో స్వయంగా ఉన్నతాధికారులే రంగంలోకి దిగారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనర్ చౌహాన్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి, దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు.
ఆపై హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. హత్య తరువాత ఆమె భర్త నాగభూషణం సహా అపార్టుమెంట్ లోని 25 మందిని విచారించినా, సౌమ్య ఫేస్ బుక్, వాట్స్ యాప్ మెసేజ్ లను పరిశీలించినా ఒక్క ఆధారమూ లభ్యం కాలేదు. నిందితుడు పకడ్బందీగా హత్య చేయడం, ఒక్క ఆధారం కూడా వదలకుండా జాగ్రత్త పడిన నిందితుడిని ఎలాగైనా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
కాగా, సౌమ్య అంత్యక్రియలను ముగించిన ఆమె తల్లిదండ్రులు, మనవడిని తీసుకుని గురువారం వెళ్లిపోగా, పోలీసుల విచారణ నిమిత్తం నాగభూషణం మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నాడు. హత్య జరిగిన రోజు రాత్రి నాగభూషణం ఆఫీసుకు వెళ్లానని చెబుతుండగా, ఆ విషయంలో నిజానిజాలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు.